
మసీదు ఎక్కడైనా కట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ రామ మందిరం..
పట్నా : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయోధ్య రామమందిర నిర్మాణం మరోసారి చర్చనీయాంశమైంది. అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాస్పద ప్రాంతంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదంటూ, ఈ కేసును వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించిన బిహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ మోదీ మాట్లాడుతూ...‘ కర్ణాటక ఎన్నికల అంశం, అర్బన్ నక్సల్స్ కేసులను రాత్రికి రాత్రి తేల్చేసేందుకు సుప్రీం ధర్మాసనానికి సమయం ఉంటుంది కానీ అయోధ్య అంశాన్ని విచారించేందుకు సమయం ఉండదు. ప్రాథమ్యాల ప్రకారమే కేసుల విచారణ ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. అంటే ఈ కేసును వారు ఎలా పరిగణిస్తున్నారో అర్థం కావడం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు.
పట్నాలో జరిగిన పార్టీ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సుశీల్ మోదీ.. అయోధ్య రామమందిర నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ‘మసీదు ఎక్కడైనా కట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ రామ మందిరం రామ జన్మస్థానమైన అయోధ్యలోనే నిర్మించాలి కదా. అందుకే గతాన్ని మర్చిపోయి. మాతో సహకరించండి’ అంటూ ఆయన ముస్లింలకు విఙ్ఞప్తి చేశారు.