బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన సుశీల్ మోదీ జీవితంలో అనేక మరపురాని ఘట్టాలు ఉన్నాయి. వాటిలో ఒకటే ఆయన లవ్ స్టోరీ. తొలి చూపులోనే జెస్సీతో ప్రేమలో పడిన ఆయన దానిని పెళ్లి వరకూ ఎలా తీసుకువెళ్లారంటే..
సుశీల్ మోదీ, జెస్సీ జార్జ్‌ల ప్రేమ కథ సినిమాను తలపిస్తుంది. రైలు ప్రయాణంలో తొలిసారిగా సుశీల్ మోదీ, జెస్సీ జార్జ్ ఒకరినొకరు చూసుకున్నారు. తరువాత మాట్లాడుకున్నారు. తరువాతి కాలంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. కలిసి జీవించాలనుకుని ప్రమాణం చేసుకున్నారు. అయితే వారుంటున్న పరిస్థితుల్లో వారికి సంప్రదాయాల అడ్డుగోడ దాటడం చాలా కష్టంగా మారింది.
ఆ సమయంలో సుశీల్ మోదీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో సభ్యునిగా ఉండేవారు. అయితే జెస్సీ జార్జ్ రాజకీయాలకు దూరంగా మెలిగేవారు. ఆమె కేరళలోని ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగారు. దీంతో విరిద్దరి మధ్య భాషతో పాటు మతపరమైన అడ్డంకి కూడా ఉంది. అయినా సుశీల్ మోదీ జెస్సీ జార్జ్‌ల ప్రేమ కథ విజయవంతంగా ముందుకు సాగింది.
40 ఏళ్ల క్రితం నాటి వీరి ప్రేమ కథ గురించి సుశీల్ మోదీ స్నేహితుడు సరయూ రాయ్ ఒకప్పుడు మీడియాకు తెలిపారు. విద్యార్థి పరిషత్ పనుల మీద సుశీల్ తరచూ రైలు ప్రయాణాలు చేసేవారు. ఆ సమయంలో ఆయన జెస్సీని రైలులో కలుసుకున్నారు. తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రేమ గురించి ఇరు కుటుంబాల సభ్యులకు తెలియగానే వారు కోపంతో రగిలిపోయారు. అయితే ఆ జంట తమ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు.
చివరికి పెద్దలు ఒప్పుకోవడంతో సుశీల్ మోదీ, జెస్సీలు 1987లో వివాహం చేసుకున్నారు. నాడు బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి వారి వివాహానికి హాజరయ్యారు. ఇది జరిగిన మూడేళ్ల తర్వాత 1990లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాటి ఎన్నికల్లో సుశీల్ మోదీ గెలుపొందారు. సుశీల్ మోదీ రాజకీయాల్లో కొనసాగగా, జెస్సీ జార్జ్ మోదీ లెక్చరర్‌గా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment