
ఇండిపెండెన్స్ డే: పాకిస్తాన్‌కు సుష్మా కానుక
న్యూఢిల్లీ: భారత 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ పౌరులకు ప్రత్యేక కానుక ప్రకటించారు. వైద్యం కోసం భారత వీసాకు దరఖాస్తు పెట్టుకున్న వారందరికీ మెడికల్ వీసాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆమె ఓ ప్రకటన చేశారు.
వీలైనంత త్వరగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ వీసాలను క్లియర్ చేయనున్నట్లు ఆమె ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్న ఈ శుభ తరుణాన.. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మెడికల్ వీసాలన్నింటినీ అనుమతిస్తున్నాం’ అని సుష్మా చేసిన ట్వీట్ సారాంశం. ప్రతి నెలా సుమారు 500 మంది పాకిస్థానీ పేషెంట్లు వైద్య చికిత్స కోసం భారత్‌కు వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.