అరుణగ్రహమైనా..భారత ఎంబసీ ఉంటుంది
న్యూఢిల్లీ: ట్వీటర్‌లో చురుగ్గా ఉండే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం ఓ వ్యక్తి అడిగిన చిలిపి ప్రశ్నకు అంతే గడుసుగా సమాధానమిచ్చి నవ్వులు పూయించారు. ‘సుష్మా స్వరాజ్ గారూ..నేను అరుణగ్రహం నుంచి మాట్లాడుతున్నాను. నాకు మంగళయాన్–1 ద్వారా 987 రోజుల క్రితం పంపిన ఆహారం, నీళ్లు అయిపోతున్నాయి. మరి మంగళయాన్–2 ను ఎప్పుడు పంపిస్తున్నారు?’ అని కరణ్ సైనీ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
దీనికి స్పందించిన సుష్మ ‘మీరు అరుణగ్రహం మీద ఉన్నా సరే.. అక్కడి భారత రాయబార కార్యాలయం మీకు సాయమందిస్తుంద’ని సమాధానమిచ్చారు. సుష్మ జవాబిచ్చిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రికి ఇలాంటి ట్వీట్లు పంపడం ఏంటని సైనీపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాను చేసిన ట్వీట్ హాస్యం కోసమే తప్ప ఎవరిని కించపరచడానికి కాదని సైనీ వివరణ ఇచ్చుకున్నారు.