
సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వాల దార్శనికతను ఇప్పటికైనా గుర్తించినందుకు ధన్యవాదాలు’ అంటూ ఆదివారం రాహుల్ ట్వీట్ చేశారు. ఐరాసలో సుష్మా మాట్లాడుతూ భారత్ ప్రపంచంలోనే ఐటీ సూపర్ పవర్‌గా ఎదిగితే పాకిస్తాన్ ఉగ్రవాద ఎగుమతిదారుగా ఉందని ఎద్దేవా చేశారు.
స్వాతంత్ర్యానంతరం భారత్ ఐఐటీలు, ఐఐఎంలతో ఘనమైన వారసత్వంతో ముందుకెళుతున్నదని, పాక్ కేవలం ఉగ్ర మూకలను సృష్టించడంలోనే సఫలమైందని ఆమె వ్యాఖ్యానించారు. భారత్‌లో ఎన్నో ప్రభుత్వాలు కొలువుతీరినా అవన్నీదేశ అభివృద్ధిలో తమదైన పాత్ర పోషించాయని ప్రస్తుతించారు. అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను సుష్మాజీ ఇప్పటికైనా గుర్తించారని రాహుల్ వ్యాఖ్యానించారు.