చెక్ పోస్ట్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు
అసలే దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఉగ్రవాదులు, విద్రోహశక్తులు ఏక్షణమైనా విరుచుకుపడొచ్చని, ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తూనేఉన్నాయి. ఇక నిత్యం అసాధారణ స్థితిలో కొనసాగే జమ్ముకశ్మీర్ లోనైతే ఇంచు ఇంచూ వదలకుండా సోదాలు, 24x7 కాపలా తప్పనిసరి. అయితే క్షేత్రస్థాయి పోలీసులు ఇవేవీ పట్టనట్లు.. తమకు అలవాటైన సోమరితనంలోనే జోగుతున్నారు సరిహద్దు రాష్ట్రంలో. అనుమానిత ఉగ్రవాదులు గుట్టుగా వచ్చి, తుపాకులు లాక్కుపోయినా చలనంలేని వ్యవస్థను ఏమనాలి?
జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లా అడిజన్ చెక్ పోస్టు వద్ద కాపలాకాస్తున్న పోలీసుల చేతుల్లోనుంచి నాలుగు తుపాకులు లాక్కొన్న ఉగ్రవాదులు అడవిలోకి పరారయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో నిందితులకోసం ఇంకా గాలిస్తూనేఉన్నారు. మైనారిటీలు ఉండే ప్రాంతంలో చెక్ పోస్ట్ ను ఏర్పాటుచేసిన పోలీస్ శాఖ అక్కడ నిరంతరం నలుగురు సిబ్బందిని కాపలాగా ఉంచుతుంది. వాళ్ల పనితీరు ఎలా ఉందో నేటి ఘటనతో వెలుగులోకి వచ్చింది. దుండగులు ఎత్తుకెళ్లినవాటిల్లో రెండు ఎస్ఎల్ ఆర్ లు, రెండు ఐఎన్ఎస్ఏఎస్ రైఫిళ్లు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఉన్నతాధికారులు చెప్పారు.