రాంచీ: మందుబాబులకు జార్ఖండ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మద్యాన్ని హోమ్ డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో మందుబాబులు గంటల తరబడి మండుటెండలో క్యూ లైన్‌లో నిల్చోవాల్సిన పనిలేదు. షాపులు ఎప్పుడు తెరుస్తారా అని మాటిమాటికీ గడియారం చూడాల్సిన పని అసలే లేదు. చేతిలో ఫోన్, దానిలో రెండు యాప్స్ ఉన్నాయంటే కళ్ల ముందు మద్యం సాక్షాత్కరించాల్సిందే. అదెలాగో వివరంగా తెలుసుకుందాం... లాక్‌డౌన్‌లో ఆర్థికంగా నష్టపోయిన ప్రభుత్వాలు దాన్ని భర్తీ చేసుకునేందుకు మద్యం అమ్మకాల వైపు మొగ్గు చూపక తప్పలేదు. కానీ మందుషాపులు ఓపెన్ అవగానే కిలోమీటర్ల కొద్దీ లైనులు, సామాజిక దూరం అన్న మాట నామమాత్రం కూడా పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటూ క్యూలైన్‌లో నిల్చోవడాలు.. దీనివల్ల ప్రభుత్వానికి ఖజానా వస్తుందన్న మాట అలా ఉంచితే కరోనా కేసులు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో జార్ఖండ్ ప్రభుత్వం దీనికో పరిష్కారం కనిపెట్టింది. (మద్యం హోం డెలివరీకి జొమాటో..!)
అందులో భాగంగా దిగ్గజ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలతో మద్యం డెలివరీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా నాలుక పిడచకట్టుకుపోయిన మద్యంప్రియుల దాహార్తిని తీర్చడంతోపాటు కరోనా వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకున్నట్లైంది. ఇప్పటికే జార్ఖండ్ రాజధాని రాంచీలో మద్యాన్ని హోమ్ డెలివరీ చేస్తోంది. ఈ సదుపాయాన్ని త్వరలోనే మిగతా నగరాలకు సైతం అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే ఓ షరతు కూడా ఉందండోయ్. ముందు మీ వయసు నిర్ధారించుకున్న తర్వాతే ఆర్డర్‌ను స్వీకరిస్తుంది. కూర్చున్న చోటకే మద్యం అందించడంపై మందుబాబులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 'మద్యం-హోం డెలివరీ' అనే అంశంపై ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కసరత్తు చేస్తున్నాయి. (ఒకే ట్రక్కులో శవాలతో పాటు కూలీలు)
Comments
Please login to add a commentAdd a comment