
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఏడాదికేడాదికి దీని తీవ్రత వాతావరణ పరిస్థితిని బట్టి మారుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వైన్‌ఫ్లూపై నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2012 సంవత్సరం నుంచి ఈ ఏడాది జనవరి 27 వరకు అంటే ఏడేళ్లలో దేశవ్యాప్తంగా 1.14 లక్షల మందికి స్వైన్‌ఫ్లూ సోకింది. అందులో 8,119 మంది మృతి చెందారు. అంటే స్వైన్‌ఫ్లూ సోకిన వారిలో 7.12 శాతం మంది మరణించారు. కేంద్ర నివేదిక వివరాలను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 2015లో అత్యధికంగా 42,592 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా, అందులో ఏకంగా 2,990 మంది చనిపోయారు. ఆ తర్వాత అత్యధికంగా 2017లో 38,811 మందికి సోకగా, 2,270 మంది చనిపోయినట్లు కేంద్ర నివేదిక తెలిపింది. 2014లో తక్కువగా 937 మందికి ఫ్లూ రాగా, అందులో 218 మంది మృతిచెందారు. దేశంలో వాతావరణ పరిస్థితులు, తీసుకునే జాగ్రత్తలపైనే దాని విస్తరణ, మరణాలు ఆధారపడి ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
తెలంగాణలో 2014 నుంచి ఇప్పటివరకు నమోదైన స్వైన్‌ఫ్లూ కేసులు, మృతులు
ఏడాది కేసులు మృతులు
2014 78 8
2015 2,956 100
2016 166 12
2017 2,165 21
2018 1,007 28
2019 245 0
మొత్తం 6,617 169
మహారాష్ట్రలో మరీ దారుణం...
ఈ ఏడేళ్లలో మహారాష్ట్రలోనే అత్యధికంగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 2012 నుంచి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 19,786 కేసులు నమోదు కాగా, 2,509 మంది మృతి చెందారు. అంతేకాదు గతేడాది 2,593 కేసులు నమోదు కాగా, 461 మంది చనిపోయారు. ఆ తర్వాత రాజస్థాన్‌లో ఏడేళ్లలో 16,177 కేసులు నమోదు కాగా, 1346 మంది చనిపోయారు. గతేడాది ఈ రాష్ట్రంలో 2,375 కేసులు నమోదు కాగా, 221 మంది చనిపోయారు. తెలంగాణలో 2014 నుంచి ఇప్పటివరకు 6,617 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా, 169 మంది మృతిచెందారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి 27 వరకు తెలంగాణలో అత్యధికంగా 245 కేసులు నమోదయ్యాయి. ఎవరూ చనిపోలేదని కేంద్రం తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ 2014 నుంచి ఇప్పటివరకు 1,208 మందికి ఫ్లూ సోకగా, అందులో 79 మంది చనిపోయారు. స్వైన్‌ఫ్లూపై నిరంతర అవగాహన కల్పించకపోవడం, నియంత్రణ చర్యలు కొరవడటమే వైరస్ విస్త్రృతి కావడానికి ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు.
మహారాష్ట్రలో 2012 నుంచి ఇప్పటి వరకు ‘ఫ్లూ’ కేసులు- 19,786
మహారాష్ట్రలో 2012 నుంచి ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూ మృతులు- 2,509