రాష్ట్రపతికి చేరిన టీ బిల్లు
పార్లమెంటుకు ఎప్పుడు వచ్చేదీ అస్పష్టత
బీజేపీ వైఖరితో కాంగ్రెస్‌లో ఆందోళన
ఆ 6 బిల్లులకూ లింకు పెడతున్న విపక్షం!
తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలంటే
రాహుల్ బిల్లులను ఆపాలని డిమాండ్ ?
12న రాజ్యసభలో విభజన బిల్లును ప్రవేశపెట్టాలని
కేంద్ర ప్రభుత్వం ఆలోచన
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు శనివారం కేంద్ర హోంశాఖ ద్వారా భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి చేరింది. విభజన బిల్లుకు శుక్రవారం కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్రపతికి పంపిన ఈ బిల్లు అక్కడి నుంచి తిరిగి హోంశాఖ ద్వారా పార్లమెంటుకు రానుంది. అయితే బిల్లును ఎప్పుడు సభలో పెట్టాలి? ఉభయ సభల్లో ముందు ఏ సభలో ప్రవేశపెట్టాలి? వంటి అంశాలపై అధికార కాంగ్రెస్‌కు ఇప్పటికీ స్పష్టత రాలేదు. ప్రతిపక్ష బీజేపీ ఇంతవరకు స్పష్టమైన హామీ ఇవ్వకపోవటంతో దీనిపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ‘తెలంగాణ బిల్లుకు సహకరిస్తామని చెప్తే ఏక్షణమైనా బిల్లును ప్రవేశపెట్టటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పటివరకు వాళ్ల డిమాండ్ ఏంటో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు...’ అని బీజేపీ నేతలతో సంప్రదింపులు జరపుతున్న కేంద్రమంత్రి ఒకరు పేర్కొన్నారు. ‘బహుశా విభజన విషయంలో తెలంగాణలో పూర్తిగా కాంగ్రెస్‌కు మైలేజ్ వస్తున్నప్పుడు తామెందుకు అంత సులువుగా మద్దతు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టు ఉంది.. ఆ పార్టీ నుంచి మరోవాదన కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పట్టుబట్టి మరీ ముఖ్యమైన 6 అవినీతి వ్యతిరేక బిల్లులు పెడుతున్నారని, ఎన్నికల్లో ఆ ఆరు బిల్లులను ప్రచారం చేసుకుని లబ్ధిపొందాలనుకుంటున్నారని బీజేపీ భావిస్తోంది. రాహుల్ ఎన్నికల ఎజెండా వెనక మనమెందుకు పరుగె త్తాలి.. టీ-బిల్లుకు మద్దతు ఇవ్వాలంటే ఆ ఆరు బిల్లులను ఇప్పుడు ఆపాల్సిందేనన్న ఆలోచన కూడా బీజేపీలో ఉన్నట్లు తెలుస్తోంది..’ అని మరో కేంద్రమంత్రి చెప్పారు.
తొలుత రాజ్యసభలోనే..!
బీజేపీ సహకరించనిపక్షంలో ముందుగా రాజ్యసభలో ఈ నెల 12న ప్రవేశపెట్టి ఆ పార్టీ వైఖరిని తెలుసుకోవాలని కేంద్రం భావిస్తోంది. సీమాంధ్రకు చెందిన రాజ్యసభ సభ్యుల సంఖ్య రాజ్యసభలో తక్కువగా ఉండడం.. అంతగా గొడవ జరిగే అవకాశం లేకపోవడం వంటి కారణాల వల్ల ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. ‘జాతీయ పార్టీలు సాధారణంగా నిర్దుష్టమైన అంశాలపై ఒకేతీరుగా వ్యవహరిస్తాయి. బీజేపీ వంటి పార్టీ తన విశ్వసనీయతను పణంగా పెడుతుందని నేననుకోను. 1996లోనే ఒక ఓటు రెండు రాష్ట్రాలని పార్టీ జాతీయకార్యవర్గం తీర్మానం చేసింది. కానీ అధికారంలోకి వచ్చాక అనేక కారణాలు చెప్పి మాట నిలబెట్టుకోలేదు. అలాంటి తప్పు మరోసారి చేయబోదని నేను బలంగా నమ్ముతున్నా..’ అని మరో కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో బీజేపీ కూడా మెట్టు దిగడం లేదు. ‘మీ ఎంపీలను అదుపు చేసుకోండి.. మా జోలికి రావొద్దు..’ అని హితవు పలుకుతోంది.అయితే సీమాంధ్రకు చెందిన తమ పార్టీ ఎంపీలు బిల్లు పెట్టే సమయంలో సహకరిస్తారని భావిస్తున్న కాంగ్రెస్.. ఒకవేళ వారు సహకరించని పక్షంలో ఆ గందరగోళం మధ్యే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదింపజేసుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.