
ఫిరాయింపులపై చర్యలు తీసుకోండి
ఎన్నికల సంస్కరణ సభలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఎన్నికల సంస్కరణలపై శ నివారం ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పార్టీ తరపున సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొని సలహాలు ఇచ్చారు. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఫిరాయింపుల అంశం తీవ్ర సమస్యగా మారిందని దీనిపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఇదొక అనారోగ్యకర పరిణామమని ఆందోళన వ్యక్తంచేశారు. ఫిరాయింపులపై పార్టీలు ఫిర్యాదు చేసిన వెంటనే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై ఆయన నొక్కి చెప్పారు.
ఇలాంటి రాజకీయాలు సరికాదు: రోజా అంశంపై ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘శాసనసభలో, పార్లమెంటులో మేమూ ఉంటూ వచ్చాం. కానీ ఈ విధమైన రాజకీయాలు ఉండకూడదు. పాలకపక్షం, ప్రతిపక్షం అని తేడా చూపకుండా దూకుడుగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యానికి వన్నె తెచ్చినట్టుగా ఉండేది. కానీ నిబంధనలను కూడా పట్టించుకోకుండా ఏడాది పాటు సస్పెండ్ చేశారు.దీనిపై సుప్రీం కోర్టు కూడా అసహనం వ్యక్తంచేసింది.’ అని అన్నారు.