
‘ఆ వీడియో ఫుటేజీ స్టాలిన్‌కు ఇవ్వండి’
చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు చురకలంటించింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనీస్వామి బలపరీక్షకు సంబంధించిన వీడియో ఫుటేజీ కాపీని ప్రతిపక్ష నేత డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి డీఎంకే స్టాలిన్‌కు ఇవ్వాలని స్పష్టం చేసింది. తిరిగి ఈ కేసును మార్చి 24విచారణ చేస్తామని తెలిపింది. తమిళనాడుకు పలు నాటకీయ పరిణామాల తర్వాత ముఖ్యమంత్రిగా పళనీస్వామిని అన్నాడీఎంకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన బలపరీక్ష సమయంలో సభలో డీఎంకే లేదు.
సీక్రెట్ బ్యాలెట్‌తో బలపరీక్ష నిర్వహించాలని డీఎంకే డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మార్షల్స్‌ను పెట్టి వారిని బయటకు బలవంతంగా పంపించి ఆ ప్రక్రియను పూర్తి చేశారు. దీనిపై అభ్యంతరం చెప్పిన స్టాలిన్ విపక్షం లేకుండా బలపరీక్ష నిర్వహించారని, దానిని తాము అంగీకరించబోమని, దానికి సంబంధించిన వీడియో ఫుటేజీ తమకు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఇచ్చేందుకు నిరాకరించడంతో కోర్టుకు వెళ్లారు. బలపరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు ఆ ఫుటేజీ తమకు ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో తమిళనాడు ప్రభుత్వాన్ని చెన్నై కోర్టు ఆదేశించింది.