తందూర్ కేసులో సుశీల్ శర్మకు శిక్ష తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: పద్దెనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తందూర్ కేసులో మాజీ యూత్ కాంగ్రెస్ నాయకుడు సుశీల్ శర్మకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. భార్య నైనా సాహ్నీని చంపి, ముక్కలుగా కోసి తందూర్ పొయ్యిలో దారుణంగా కాల్చేసిన ఆయనకు 2003లో దిగువకోర్టు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు యావజ్జీవ శిక్షగా మారుస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. సుశీల్ శర్మకు గతంలో నేరచరిత్ర లేకపోవడం వల్ల అతడు సమాజానికి ముప్పుకాకపోవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. అతడు భార్యను అమితంగా ప్రేమించాడని, అయితే ఆమెపై అనుమానంతో క్షణికావేశంలో హత్య చేసినట్లు కనబడుతోందని పేర్కొంది. దీనికి అతడు పశ్చాత్తాపం చెందినట్లు కనిపిస్తోందని, ఇది అత్యంత అరుదైన నేరం కాదని, అందువల్ల అతనికి మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తున్నట్లు స్పష్టం చేసింది.