టీమిండియా ఆటగాళ్లు (ఫైల్ ఫొటో)
నాటింగ్ హామ్ : తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన టీమిండియా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితం ఇవ్వడంతో పాటు మూడో టెస్ట్ మ్యాచ్ ఫీజును భారత క్రికెటర్లు విరాళంగా అందివ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జాతీయ మీడియా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఆటగాళ్ల నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. ఒక్కో టెస్ట్ మ్యాచ్ ద్వారా జట్టు మొత్తం ఆటగాళ్లకు కలిపి దాదాపు 1.5 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
బుధవారం మూడో టెస్ట్ మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్‌లో గెలిచి కేరళ వరద బాధితులకు అంకితమివ్వాలని జట్టుగా నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమిష్టిగా రాణించి విజయాన్నందుకున్నాం. ఈ గెలుపును వారికి అంకితం ఇస్తున్నాం. ప్రస్తుతం కేరళలో చాలా విషాదకరమైన పరిస్థితి నెలకొందని’ చెప్పాడు. కేరళ వరద బాధితులకు తమ వంతు సాయంగా ఒక టెస్ట్ మ్యాచ్ ఫీజును విరాళంగా అందించాలని టీమిండియా నిర్ణయించుకుంది. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ.. ఆటగాళ్లు సమష్టిగా నిర్ణయం తీసుకుంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నట్లు సమాచారం. అయితే కేరళ వరద బాధితులకు టీమిండియా విరాళంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కాగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రూ.80 కోట్ల ఆర్థిక సాయం చేశాడంటూ ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో ఓ పోస్ట్ చక్కర్లు కొడుతోంది. అయితే కేరళ బాధితులకు అన్ని విధాలా సాయం అందాలని, సహాయక బృందాలు వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కోహ్లి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment