తెలంగాణ బిల్లు మాత్రమే అసెంబ్లీకి: సుశీల్‌కుమార్ షిండే | Telangana bill will be forwarded to state assembly, says Sushil kumar shinde | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లు మాత్రమే అసెంబ్లీకి: సుశీల్‌కుమార్ షిండే

Published Fri, Oct 11 2013 2:41 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

తెలంగాణ బిల్లు మాత్రమే అసెంబ్లీకి: సుశీల్‌కుమార్ షిండే - Sakshi

తెలంగాణ బిల్లు మాత్రమే అసెంబ్లీకి: సుశీల్‌కుమార్ షిండే

తెలంగాణ బిల్లు మాత్రమే రాష్ట్ర అసెంబ్లీ ముందుకు వస్తుందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే గురువారం స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రివర్గ తీర్మానం రాదు
స్పష్టం చేసిన కేంద్ర హోంమంత్రి షిండే


 సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు మాత్రమే రాష్ట్ర అసెంబ్లీ ముందుకు వస్తుందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే గురువారం స్పష్టం చేశారు. అదీ రాష్ట్ర విభజనపై ఏర్పాటుచేసిన మంత్రుల బృందం నివేదిక అందించిన తరువాత, ఆ నివేదిక ప్రాతిపదికగా రూపొందించిన బిల్లును రాష్ట్రపతికి పంపిస్తే, ఆయన అసెంబ్లీ పరిశీలన కోసం రాష్ట్రానికి పంపిస్తారని వివరించారు. హోం మంత్రిత్వ శాఖ నెలవారీ నివేదికను విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర మంత్రివర్గ తీర్మానాన్ని శాసనసభకు పంపుతారని, ఆ తర్వాత తెలంగాణ బిల్లు మరోసారి అసెంబ్లీకి వెళ్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చేస్తున్న ప్రకటనలకు విరుద్ధంగా షిండే వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ‘సాధారణంగా అయితే, రాష్ట్ర శాసనసభల తీర్మానాల ఆధారంగా రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమవుతుంది.

అయితే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ అంశాన్ని పెండింగ్‌లో ఉంచింది. దాంతో కేంద్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ జీవోఎం రూపొందించిన నివేదిక ఆధారంగా తయారయ్యే బిల్లును రాష్ట్రపతికి పంపిస్తాం. ఆయన దానిని రాష్ట్ర శాసనసభకు పంపుతారు. అసెంబ్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెడతాం’ అని షిండే వివరించారు. కాగా, తెలంగాణ నిర్ణయం హడావుడిగా తీసుకున్నది కాదని, సుదీర్ఘ సంప్రదింపుల అనంతరమే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నామని షిండే పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంపై వెనక్కుతగ్గబోమని, సాధ్యమైనంత త్వరగా విభజన ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. విభజన బిల్లును రాష్ట్ర శాసనసభ తిరస్కరిస్తే ఏం చేయాలన్నదానికి రాజ్యాంగంలోనే పరిష్కార మార్గాలున్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, ప్రజలకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
 
 ఇప్పుడే చెప్పలేం..!
 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే విషయంపై హోంమంత్రి స్పష్టత నివ్వలేదు. ఆ విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు. అలాగే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశంపై కూడా ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. నివేదిక రూపకల్పనపై మొదట్లో విధించిన 6 వారాల గడవును జీఓఎం విధివిధానాల జాబితా నుంచి తొలగించడంపై షిండే వివరణ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా ప్రక్రియను పూర్తిచేసేందుకే గడవు అంశాన్ని తొలగించామన్నారు. జీఓఎం ఎవరెవరితో సంప్రదింపులు జరపాలన్న విషయాన్ని త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. ఏడుగురు కేంద్రమంత్రులతో ఏర్పాటైన జీవోఎం శుక్రవారంనాడు సమావేశం కానున్నదని తెలిపారు.
 
 బాబు మాటకు విలువిచ్చే ఆ నిర్ణయం!
 ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై షిండే వ్యంగంగా స్పందించారు. ‘చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని విస్పష్టమైన తీర్మానం చేసింది. అదే అభిప్రాయాన్ని అఖిలపక్షంలోనూ  పునరుద్ఘాటించింది. వారి మాటకు విలువిచ్చే మా ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తోంది’ అన్నారు. ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం ఏపీభవన్ ఆవరణలో దీక్ష చేపట్టిన చంద్రబాబు నాయుడును అక్కడి నుండి తొలగించేందుకు కేంద్రం చొరవ తీసుకునేందుకు హోం మంత్రి విముఖత వ్యక్తం చేశారు. ‘ఎవరైనా తమ ప్రాంగణంలో అనుమతి లేకుండా చొరబడ్డారని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భావిస్తే వారు కోర్టుకు వెళ్లి బయటకు పంపేందుకు ఉత్తర్వులు తెచ్చుకోవచ్చు. ఆ ఆదేశాలను అమలుకు అవసరమైన సహాయం చేస్తాం’ అన్నారు.
 
 రాష్ట్ర ప్రాతినిధ్యం లేకపోయినా నష్టం లేదు
 మంత్రుల బృందం, ఆంటోనీ కమిటీ వేరువేరని షిండే తెలిపారు. ఆంటోనీ కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయగా, జీఓఎంను ఏర్పాటు చేసింది కేంద్రప్రభుత్వమని వివరించారు. విభజన ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేకపోవడంపై ప్రశ్నించగా..దాని వల్ల నష్టమేమీ లేదని, ఎవరికి స్థానం కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. సీమాంద్రుల అన్ని సమస్యలకు జీఓఎం పరిష్కారం చూపిస్తుందన్న విశ్వాసాన్ని షిండే వ్యక్తం చేశారు.
 
 రాజధాని ఎక్కడో..
 విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు అది ఆ ప్రాంత ప్రజలు, నేతలు నిర్ణయించుకోవాల్సిన విషయమని స్పష్టంచేశారు. ‘గతంలో ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది, గుంటూరులో హైకోర్టు ఉండేదని మంత్రివర్గానికి సమర్పించిన కేబినెట్ నోట్‌లో పేర్కొన్నాం, కానీ, ఇప్పుడు రాజధానిని ఎక్కడ నెలకొల్పుకోవాలనుకొంటారో చూద్దాం’ అన్నారు.
 
  రాష్ట్ర విభజన నిర్ణయం ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా, రాజకీయ కారణాలతో తీసుకున్నదిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. విభజన నిర్ణయం తొందరపాటుతో తీసుకున్నది కాదని, జస్టిస్ శ్రీకష్ణ కమిటీ అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేసిందని, సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత అన్నీ ఆలోచించి తీసుకొన్న నిర్ణయమని  షిండే వివరించారు. తాను హోంశాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఒక అఖిలపక్ష  సమావేశాన్ని నిర్వహించానని, అక్కడ కూడా ఎవరూ విభజనను వ్యతిరేకించలేదన్నారు. విభజనకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి,భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. తెలంగాణ ఏర్పాటుతో ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు పెరిగాయని, అయితే వాటిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోబోమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement