న్యూఢిల్లీ : దేశ రాజధానిలో తెలంగాణ న్యాయవాదులు సోమవారం మహాధర్నా నిర్వహిస్తున్నారు. హైకోర్టు విభజన చేయాలంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆందోళన చేపట్టింది. హైకోర్టు విభజన అంశంపై నిర్వహిస్తున్న ఈ ధర్నాలో పది జిల్లాలకు చెందిన న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైకోర్టు విభజన, తెలంగాణలో ఆంధ్రా న్యాయమూర్తుల నియామకాలు రద్దు చేయాలని, న్యాయాధికారులపై సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
న్యాయవాదుల ఆందోళనకు పలువురు టీఆర్‌ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు. న్యాయాధికారుల విభజనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలన్నారు. హైకోర్టు విభజన జరిగేవరకూ తెలంగాణ న్యాయవాదులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.