
ఢిల్లీ : మలేషియాలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తిపై కేంద్ర విదేశాంగశాఖ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. మలేషియాలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. అందుకు కౌలలంపూర్ నుంచి విశాఖ, ఢిల్లీకి ఎయిర్ ఏషియా విమానాలు ఏర్పాటు చేస్తామన్నారు. మలేషియాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని జైశంకర్ తెలిపారు. (‘నెల్లూరు కరోనా బాధితుడు కోలుకుంటున్నాడు’)
అంతకుముందు మలేషియాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. మలేషియాలో చిక్కుకున్నవారిని వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులకు జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఢిల్లీ ఏపీ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డి, ఢిల్లీ ఏపీ భవన్ అధికారులు, విదేశాంగశాఖతో సీఎంఓ అధికారులతో సమన్వయమయ్యారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలపాలని ఢిల్లీ ఏపీ భవన్ అధికారులను కోరారు.