మరాఠీ గడ్డపై తెలుగు బిడ్డలు
- ముంబైతోపాటు మహారాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర
- రాజకీయ, సామాజిక సేవల్లోనూ తమదైన ముద్ర
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మరాఠీలతో తెలుగు ప్రజలు మమేకమైపోయారు. ముంబైతోపాటు మహారాష్ట్రలోని పలు రంగాల్లో అభివృద్ధిలో తెలుగు ప్రజలు తమదైన ముద్రను వేయగలిగారు. భవన నిర్మాణం, రాజకీయాలతోపాటు పలు రంగాల్లో రాణించారు. రాష్ట్ర రాజకీయాల్లో అనేక మంది తెలుగు ప్రజలు క్రియాశీలక పాత్ర పోషించారు. రాష్ట్ర చరిత్రలో తెలుగువారికి ఓ ప్రత్యేకత ఉంది. స్పీకర్ , ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్లతోపాటు మేయర్ల వరకు అనేక పదవులను తెలుగువారు అనుభవించారు. ఈ నెల 15న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అన్నిరంగాల్లో ఓ వెలుగు వెలిగిన తెలుగు ప్రజల కీర్తి గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
తొలిస్పీకర్‌గా సయాజీ శీలం
దేశంలోనే అత్యంత ప్రాముఖ్యతగల రాష్ట్రాల్లో ఒకైటె న మహారాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌గా తెలుగు వ్యక్తి సయాజీ శీలం పనిచేశారు. తెలుగువారి కీర్తి పతాకాన్ని మరాఠ గడ్డపై ఆవిష్కరించారు. అప్పటి నిజాం రాష్ట్రం నుంచి బొంబాయికి వచ్చిన సయాజీ శీలం. మే 18, 1896లో జన్మించారు. బాంబే విశ్వవిద్యాలయం నుంచి 1912లో మెట్రిక్యులేషన్, 1916లో బీ.ఏ, 1920లో ఎల్.ఎల్.బీ పూర్తి చేశారు. సామాజిక సేవాతత్పరుడైన సయాజీ 1914లో కామాటిపుర, నాగ్‌పాడా, బైకలా ప్రాంతాలుండే ‘ఈ’ వార్డు పరిధిలో పేద, నిరిక్షరాస్యులైన ప్రజల అభ్యన్నతికోసం పనిచేశాడు. 1918 సంవత్సరంలో అంటువ్యాధి సమస్య తీవ్రంగా ప్రబలిన సమయంలో ఆయన ధైర్యంగా ప్రజలకు సేవలందించారు.
విద్యా సంస్థల నిర్వాహణలో, వైద్య శిబిరాల ఏర్పాటులో సయాజీ చురుకైన పాత్ర పోషించారు. తెలుగు మిత్ర అనే అనే పత్రిక ను మరాఠి భాషలో నిర్వహించి వెనుకబడిన వర్గాల కోసం కృషి చేశారు. సయాజీ శీలం బాంబే స్టేట్ స్పీకర్‌గా 21 నవబంర్ 1956 నుంచి 1957 వరకు పనిచేశారు. 1957 నుంచి 1960 ఏప్రిల్ వరకు సభాపతిగా తన సేవలనందించారు. భాష ప్రాతిపదికగా సంయుక్త మహారాష్ట్ర అవతరించిన తర్వాత ఆయన రాష్ట్ర శాసనసభకు తొలి స్పీకర్‌గా 1960 మే 1 నుంచి 1962 మార్చి 19 వరకు కొనసాగారు. తర్వాత పాండిచ్చేరికి లెఫ్ట్‌నె ంట్ గవర్నర్‌గా పదవీ భాద్యతలను చేపట్టారు. నేటితరం తెలుగు నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ముంబై అభివృద్ధిలో ‘పుప్పాల’ కీలకపాత్ర...
ముంబై అభివృద్ధి అనేక మంది తెలుగు ప్రజలు కీలకపాత్ర పోషించారు. శంకర్‌రావ్ పుప్పాల మనవడు నర్సింగ్‌రావ్ పుప్పాల 1942 నుంచి ముంబైకి సుపరిచితులు. ఆయన మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్ నుంచి ముంబై మేయర్‌గా ఎదిగారు. ముంబై అభివృద్ధికి కృషిచేసి తెలుగువారి ముద్రను వేయగలిగారు. ముంబై నగరం పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చెందడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అన్ని రాష్ట్రాల ప్రజలు వలస రావడానికి అవకాశం ఏర్పడింది.
ముంబై తెలుగు వెలుగులు..
ముంబై రాజకీయాల్లో అనేక మంది తెలుగు ప్రజలు ఓ వెలుగు వెలిగారు. తెలుగు కాంట్రాక్టర్ జాయా కారాడీ లింగూ బాయిఖలా ‘ఈ’ డివిజన్ నుంచి ముంబై మున్సిపల్ కార్పొరేటర్‌గా 12 ఏళ్లు పని చేశారు.1893లో జరిగిన మతపరమైన అల్లర్లను నివారించడంలో జాయాకారాడీ లింగూ కీలక పాత్ర నిర్వహించారు. కామాటిపుర, నాగ్‌పాడా ప్రాంతాల్లో అల్లర్లు ఎక్కువగా జరుగుతుండేవి. హిందూ-ముస్లిం ప్రజల మధ్య సఖ్యతను పెంచేందుకు లింగూ కీలకపాత్ర పోషించారు. లింగూ నిర్వహించిన పాత్రను అప్పటి పోలీస్ కమిషనర్ విన్సెంట్ సైతం ప్రశంసించారు.
లింగూ 63వ యేట, అక్టోబరు 28, 1898న మరణించారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడానికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అదే సంవత్సరం నవంబర్ 9న ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ముంబై రాజకీయ సమాజంలో రావ్ బహదూర్ యెల్లప్పా బలరామ్ పేరు తరచుగా వినిపించేది. 1888 నుంచి ఆయన 27 సంవత్సరాల పాటు భైఖలా డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పనిచేశారు. బల్‌రామ్‌కు అనేక మంది రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన చేసిన అనేక స్వచ్ఛందసేవలు చేశారు. 1883లో జస్టిస్ ఆఫ్ పీస్, 1891లో రావ్‌సాహెబ్, 1898లో రావ్‌బహదూర్ బిరుదులనిచ్చి సన్మానించారు. 1914లో యెల్లప్పా బలరామ్ మరణించారు.
రాజకీయాల్లో మేరు నగధీరులు
నాటి రాజకీయాల్లో పర్ష శంకర్‌రావు, పుప్పాల పరశురామ్, పుప్పాల శంకర్‌రావ్, రావ్‌సాహెబ్ పోరాడే, రాయపల్లి దశరథ్ తదితరులు కీలకపాత్ర నిర్వహించారు. పర్ష శంకర్‌రావ్ అప్పట్లో తెలుగు వాళ్ల సమస్యలపై వార్తపత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. తెలుగు సమాచార్ లాంటి పత్రికను ఆయన నడిపించారు. విద్యా సంస్థలు గ్రంథాలయాల నిర్వహణ కోసం నిధులను వెచ్చించారు. మద్యపాన నిషేధం, స్వదేశి వస్తువు వినియోగ ప్రచారాల కోసం ఆయన జీవిత కాలం పనిచేశారు. లోక్‌మాన్య తిలక్ జ్ఞాన కోశ్కర్ ఖేత్కార్, బాబాసాహెబ్ అంబేద్కర్ కత్తరకోటి శంకరాచార్యా లాంటి గొప్ప వ్యక్తుల స్నేహాన్ని శంకర్‌రావ్ సంపాదించారు. పుణే నగరంలో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన సార్వజనిక గణేశోత్సవాలకు పర్ష శంకర్‌రావ్ 13వ వీధికి కార్యదర్శిగా ఉండేవారు.
కామాటిపుర కాంగ్రెస్ కమిటీకి ఆయన రెండు సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. శంకర్‌రావ్ చూపిన ఉత్తమ సేవాభావానికి ఆ నాటి కాంగ్రెస్ నాయకులు సయాజీరావ్ శీలం ఆకర్శితులయ్యారు. శంకర్‌రావ్‌ను కాంగ్రెస్‌లో చేర్పించారు. కామాటిపురాలోని తెలుగు సమాజంలో కాంగ్రెస్ ఉద్యమాలకు పుప్పాల శంకర్‌రావ్ సయాజీ శీలంలు, వర్ష శంకర్‌రావ్‌లు ప్రసిద్ధి చెందారు. 1935లో 40 సంవత్సరాల వయస్సులోనే రక్తపోటుతో శంకర్‌రావ్ ఉప్పాల మరణించారు. ఆ తరువాత 1939లో ఏప్రిల్ ఆరున వర్ష శంకర్‌రావ్ మరణించారు. ఈ ఇద్దరు నాయకులు ఆకస్మికంగా మరణించడంతో తెలుగు సమాజంలో నాయకత్వ కొరత ఏర్పడింది.
అనేక మంది విద్యావంతులు ఆ లోటును పూరించగలిగారు. శంకర్‌రావ్ పుప్పాల చనిపోయినప్పుడు ఆయన కుమారుడు పరశురామ్ 17 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉండేది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ 1942 ఉద్యమంలో పరశురామ్ కీలకపాత్ర నిర్వహించారు. కామాటిపురా, నాగ్‌పాడాలలో అనేక సంవత్సరాల పాటు మత ఘర్షణలు కొనసాగాయి. అనేక మంది తెలుగు నాయకుల మాదిరిగానే లింగన్న పూజారి అనే తెలుగు నాయకుడు మత సామరస్యాన్ని ఈ ప్రాంతంలో నెలకొల్పేందుకు విశేషంగా కషి చేశారు. 1944లో డంకన్ రోడ్‌లో జరిగిన అల్లర్లలో లింగన్న పూజారి ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. అప్పటి కమిషనర్ విల్సన్ లింగన్నను ప్రశంసించారు. లింగన్న పూజారి 1946లో మున్సిపల్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆనాటి నుంచి రాష్ట్రంలో తెలుగు ప్రజల కీర్తిపతాకం రెపరెపలాడుతోంది.