
పీఎంవో సైట్ లో తొలి సందేశం
15వ భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) వెబ్‌సైట్ ద్వారా దేశప్రజలకు తొలి సందేశం ఇచ్చారు.
సుస్థిర, సుపరిపాలన అందిస్తానని దేశ ప్రజలకు మోడీ హామీ
తనకు ప్రజల ఆశీస్సులు, సహకారం కావాలని వినతి
న్యూఢిల్లీ: 15వ భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) వెబ్‌సైట్ ద్వారా దేశప్రజలకు తొలి సందేశం ఇచ్చారు. మార్పును ఆశించి తనకు పట్టం కట్టిన దేశ ప్రజలకు సుస్థిర, సుపరిపాలన అందిస్తానని హామీ ఇచ్చారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తనకు ప్రజల మద్దతు, ఆశీస్సులు, సహకారం కావాలని ఆకాంక్షించారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని అత్యున్నత దశకు తీసుకెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. దేశాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయడం ద్వారా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలిచి ప్రపంచ శాంతికి, అభివృద్ధికి పాటుపడేలా చేస్తామన్నారు. పీఎంవో వెబ్‌సైట్ తనకు, ప్రజలకు మధ్య ప్రత్యక్ష సంబంధాల మాద్యమంగా పని చేస్తుందని ఆయన ఆకాంక్షించారు.
టెక్నాలజీపై తనకు అపారమైన నమ్మకం ఉందని, సోషల్ మీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలతో అభిప్రాయాలు పంచుకోవచ్చని చెప్పారు. దీని ద్వారా ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేపట్టబోయే వినూత్న కార్యక్రమాల గురించి, తన పర్యటనలు, ప్రభుత్వ పథకాల గురించి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని వివరించారు. కాగా, మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని సెకన్లలోనే పీఎంవో వెబ్‌సైట్ రూపు రేఖలు మారిపోయాయి. మోడీ తొలి సందేశం, ఆయనకు సంబంధించిన చిత్రాలతో పీఎంవో వెబ్‌సైట్ కొత్త సొబగులు అద్దుకుంది. అలాగే కొన్ని కొత్త సెక్షన్లను సైతం ఏర్పాటు చేశారు. ఇందులో మోడీ వ్యక్తిగత జీవితం ఒక విభాగంగా ఉంది. మోడీ ప్రొఫైల్‌ను కూడా పొందుపరిచారు. ఇందులో మోడీని అంకితభావం, క్రియాశీలకత, ధృడచిత్తం కలిగిన నాయకునిగా.. వంద కోట్ల మంది ప్రజల ఆశా రేఖగా అభివర్ణించడం గమనార్హం. అలాగే ఆర్‌ఎస్‌ఎస్ వలంటీర్ స్థాయి నుంచి బీజేపీ నేతగా మోడీ ఎదిగిన తీరును సవివరంగా అందించారు.