నీట్ ఫలితాల విడుదలకు మార్గం సుగమం
ఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాల విడుదలకు గల అడ్డంకులు తొలగిపోయాయి. ఫలితాల విడులను నిలిపివేయాలని గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం అత్యున్నత ధర్మాసనం స్టే విధించింది. దీంతో నీట్ ఫలితాల విడుదలకు మార్గం సుగమం అయింది.
నీట్ ఫలితాలను నిలిపివేయాలని గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. తమిళ, ఆంగ్ల భాషల ప్రశ్నపత్రాల మధ్య తేడా ఉందని, అందువల్ల పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అక్కడి విద్యార్థులు కొందరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో ఫలితాల విడుదలను నిలిపివేయాలని తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ సీబీఎస్‌ఈ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. నీట్ ఫలితాలను ప్రకటించాలని సీబీఎస్‌ఈని ఆదేశించింది. అలాగే నీట్ అడ్మిషన్‌ల షెడ్యూల్‌ను ప్రభావితం చేసే పిటిషన్‌లను హైకోర్టులు విచారించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది.