కథనాలన్నీ ‘కబుర్లే’!
సాక్షి, ముంబై: తనతోపాటు ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను మారుస్తున్నారంటూ పత్రికలు, టీవీల్లో వస్తున్న కథనాల్లో నిజం లేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ఈ విషయమై పుణేలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనున్నట్లు వస్తున్న కథనాల్లో నిజం లేదు. అధిష్టానం ఈ విషయమై ఎటువంటి ఆలోచనలు చేయలేదు. ఇవన్నీ కేవలం వార్తాపత్రికలు, టీవీల్లో వస్తున్న కథనాలు మాత్రమే. ఒకవేళ అదే నిజమైతే అధిష్టానం ఆదేశాలను శిరసావహిస్తా. వారు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతగా నిర్వర్తిస్తా.
లోకసభ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. దీంతో తమ పార్టీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. దీనికి బాధ్యత వహిస్తూ తాము అప్పుడే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధిష్టానానికి చెప్పాం. పార్టీలో అవసరమైన మార్పులు చేయాలని మేమందరం అధిష్టానాన్ని కోరాం. అయితే ఇదంతా ఎన్నికల ఫలితాల అనంతరమే జరిగింది. అప్పటి పరిణామాలపై మీడియాలో ఇప్పుడు కథనాలు ప్రసారమవుతున్నాయి. తాజాగా అధిష్టానం ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా నాకు తెలియదు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఆమోదయోగ్యమే. ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తాన’న్నారు.
ఎన్నికలపై చర్చలు జరిగాయి...
రాబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంపై ఎన్సీపీతో ఇటీవల చర్చలు జరిగాయని పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ఎలాంటి ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకెళ్లాలనే విషయంపై పార్టీ సీనియర్ నాయకులతో ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ చర్చలు జరిపారని, అదే విషయమై తనతోకూడా చర్చలు జరిపారన్నారు. నాయకత్వమార్పు విషయంపై తమ మధ్య ఎటువంటి చర్చలు జరగలేదన్నారు. తనకు ఏదైనా సమాచారం అందితే ముందుగానే మీడియాకు తెలియజేస్తానని చెప్పారు. ఇదిలాఉండగా ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ కూడా నాయకత్వ మార్పు కథనాలను కొట్టిపారేశారు. ఎన్నికలముందు ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టంచేశారు.