మారుతున్న ‘మహా’ సమీకరణాలు!
- ఒకే వేదికపై మోదీ, పవార్
- కలసి భోజనం.. పవార్‌కు మోదీ ప్రశంసలు
బారామతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్సీపీ అవినీతి పార్టీ అని, ఆ పార్టీ అధినేత శరద్ పవార్ చాలా అంశాల్లో విఫలమయ్యారని నిప్పులు చెరిగిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పవార్‌తో వేదిక పంచుకున్నారు. కలిసి భోజనమూ చేశారు. పవార్ స్వస్థలమైన మహారాష్ట్రలోని బారామతిలో చోటుచేసుకున్న ఈ పరిణామానికి రాజకీయ అర్థాలు తీయొద్దని ఇద్దరు నేతలూ చెప్పినా, మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్ర అధికారపక్షం బీజేపీకి తన మిత్రపక్షమైన శివసేనతో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో వీరు బహిరంగంగా కలసి కనిపించడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ, ఎన్సీపీలు దగ్గరవుతున్నాయనడానికి ఇది సంకేతమని భావిస్తున్నారు. బారామతిలో శుక్రవారం పవార్ నిర్వహిస్తున్న పలు సంస్థల కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ కృషి విజ్ఞాన్ కేంద్రంలో కూరగాయల సాగు నైపుణ్యాల కేంద్రాన్ని ప్రారంభించి.
రైతుల సదస్సులో ప్రసంగించారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఎదురైన సమస్యల పరిష్కారానికి పవార్ సాయం చేశారన్నారు. ఆ సాయానికి గాను సత్కరిస్తున్నానని చెప్పారు. పవార్‌తో కలసి వేదిక పంచుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్యంలోని అందం అదేనన్నారు. ప్రజాస్వామ్యం వివాదం, సంభాషణలపై నడుస్తుందని పేర్కొన్నారు. మోదీ అభివృద్ధి అజెండాకు మద్దతిస్తున్నానని పవార్ చెప్పారు.