82 మంది విద్యార్థులు గత తొమ్మిది సంవత్సరాలుగా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పరీక్షలు రాస్తూ ఫెయిలవుతున్నారు. ఈ కాలంలో కనీసం ఒక విద్యార్థి 12 నుంచి 15 సార్లు ఫెయిలయిన పేపర్లనే రాశారు. అయినా, వీరి పాస్ కాకపోతుండటంతో గుజరాత్ యూనివర్సిటీ వీరిని దృష్టిలో ఉంచుకుని వెబ్ సైట్ లో మెటీరియల్ ను కూడా అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా కచ్చితంగా వెబ్ సైట్ లో ఉన్న మెటీరియల్ నుంచే పరీక్షల్లో ప్రశ్నలు వచ్చేలా నిబంధనలు కూడా తెచ్చింది. అయినా, మార్పు లేదు. అదే తంతు. 82 మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క సబ్జెక్టులోనైనా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. కాగా, వీరందరికి పరీక్షల్లో కాపీలు అందిచినా ఉత్తీర్ణులు కాలేరనే జోక్ క్యాంపస్ లో వినిపిస్తోంది.
చదువుపై విద్యార్థుల అలసత్వంతో విసిగిపోయిన యూనివర్సిటీ యాజమాన్యం ఈ సారి నిర్వహించబోయే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని వారిని తిరిగి మొదటి ఏడాది నుంచి గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జీటీయూ)లో చేరుస్తామని ప్రకటించింది. జీయూ 2007లో జీటీయూగా మారింది. కాగా, అప్పటికే ఆ ఏడాది బ్యాచ్ లు ప్రారంభంకావడంతో వారందరికి జీయూ కిందే పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. కాదా, విద్యార్థులు అందరూ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకుని బీఈ పట్టాని అందుకోగా, 82 మంది మాత్రం మిగిలిపోయారు. కాగా, వీరందరి చేత బీఈని పూర్తి చేయించేందుకు జీయూ ఆపసోపాలు పడాల్సివస్తోంది. యూనివర్సిటీ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 24తో పరీక్షలు ముగియనున్నాయి. సగానికి సగం మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావడం లేదు. మరికొందరు పరీక్ష హాలుకు వచ్చి మూడు గంటల సమయాన్ని అక్కడ వెచ్చించకుండా గంటన్నరకే వెళ్లిపోతున్నారు. ఫెయిలయిన విద్యార్థులందరూ ఏదో ఒక ఉద్యోగంలో చేరడంతో సమయం లేకపోవడం వల్లే బీఈ డిగ్రీపై దృష్టి సారించలేకపోతున్నామని తెలిపారు.
ఈ ఏడాది నుంచి పరీక్ష ఫీజును రూ.5,000లుగా చేసిన జీయూ ఈ విధంగానైనా విద్యార్థుల దృష్టిని చదువుపై మళ్లించాలని చేసిన ప్రయత్నం ఈ సారి కూడా విఫలమైనట్లు కనిపిస్తోంది. 82 మందిలో ఓ విద్యార్థికి ఎనిమిది పేపర్లు బ్యాక్ లాగ్ లు ఉన్నాయని, అతను 40 వేల రూపాయల పరీక్ష ఫీజును చెల్లించాడిన జీయూ అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా ఒక విద్యార్థికి ఫెయిలయిన పేపర్ ను రెండు సార్లు తిరిగి రాసుకునేందుకు అనుమతి ఇస్తారు. కాగా, జీయూ వీరికి 15 ఛాన్స్ లు ఇచ్చినా వినియోగించుకోలేక పోతున్నారు.