
అతడి ఆశయం అలుపెరుగదు!
బగీచా సింగ్‌కు చిన్ననాటి నుంచే దేశానికి సేవచేయాలనే కోరిక ఎక్కువ.
ఎనభయ్యేళ్లు దాటాక ఎవరైనా ఏం చేస్తారు..? వాలు కుర్చీపై నడుం వాల్చి హాయిగా సేదదీరుతారు. గడచిన కాలాన్ని, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ జీవితాన్ని బేరీజు వేసుకుంటారు. తమ జ్ఞాపకాల ప్రయాణంలో ఎక్కడో ఓ చోట ఆగి, సంతృప్తి చెందిపోతారు. కానీ, పానిపట్టుకు చెందిన 81 ఏళ్ల ‘బగీచా సింగ్’ అలా కాదు. అతడి శరీరంలో శక్తి ఉన్నన్నాళ్లూ సంతృప్తి అన్న పదానికి తావే లేదంటాడు. అలుపెరుగని ప్రయాణం చేస్తూనే ఉంటాడు. ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిలో 5 లక్షల 70 వేల కిలోమీటర్లు నడిచాడు. ఇంకా నడుస్తూనే ఉంటానని చెబుతున్నాడు. ఇంతకీ ఎందుకీ ప్రయాణం..? దేనికోసం అతడి ప్రయత్నం..??
బగీచా సింగ్‌కు చిన్ననాటి నుంచే దేశానికి సేవచేయాలనే కోరిక ఎక్కువ. తన చదువు పూర్తికాగానే తల్లిదండ్రులతో అదే విషయాన్ని చెప్పేశాడు. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నాననీ..! చెప్పినట్టుగానే బగీచా వివాహం చేసుకోలేదు. స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో దేశ సేవకు పరితపించాడు. పొగ తాగడం, మద్యాన్ని సేవించడం అత్యంత ప్రమాదకరమని ఆయన బలంగా నమ్మాడు. వీటి కారణంగానే దేశ ప్రగతి కుంటుపడే ప్రమాదముందని గ్రహించాడు. అంతే.. అప్పటి నుంచీ పొగాకు, మద్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు.
1993, ఫిబ్రవరి 22 నుంచి ఈయన ప్రయాణం విభిన్నంగా సాగింది. ధూమపానం, మద్యపానాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు దేశవ్యాప్తంగా పర్యటనలు చేయాలనుకున్నాడు. అయితే, అందుకు సరిపడా సొమ్ము ఆయన దగ్గరలేదు. అంతే.. ఓ పెద్ద బ్యాగులో తనకు కావాల్సిన వస్తువులన్నీ పడేసి, నడుంపై మోసుకుంటూ నడక ప్రారంభించాడు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకూ కాలినడకన తిరిగి మొదటి పర్యటన పూర్తిచేశాడు. అలా గడచిన 23 ఏళ్లలో 22 సార్లు దేశాన్ని చుట్టేశాడు. దాదాపు 5 లక్షల 70 వేల కి.మీ పైచిలుకు దూరాన్ని కాలినడకన తిరిగాడు. మార్గమధ్యంలో కనిపించేవారికి పొగాకు, ఆల్కహాల్, బాల కార్మికులు, అవినీతి లాంటి సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తున్నాడు.
రెండు జాతీయ జెండాలను కట్టి ఉంచిన తొంభై కేజీల బ్యాగును మోసుకుంటూ.. విభిన్నంగా కనిపిస్తాడు బగీచా. తన ప్రయాణం గురించి అతన్ని ప్రశ్నిస్తే.. ఎన్నో మధుర జ్ఞాపకాలను మనతో పంచుకుంటాడు. తన ప్రయాణంలో ఎందరో రాజకీయ ప్రముఖులను, సెలబ్రిటీలను కలుసుకున్నాడు. ఓ సారి ఏనుగులను కూడా..!!
‘‘తేజ్‌పూర్ నుంచి గువాహటికి వెళ్తున్నప్పుడు ఓ అడవిని దాటాల్సివచ్చింది. ఆ అడవిలో ఏనుగుల గుంపు ఉంటుందని, వాటికి అరటిపండ్లు ఇవ్వకపోతే అడుగుకూడా కదలనివ్వవని విన్నాను. వెంటనే ఆరు కిలోల పండ్లు కొని, ప్రయాణం మొదలుపెట్టాను. ఊహించినట్టుగానే ఏనుగులు నన్ను అడ్డుకున్నాయి. వాటికి నా దగ్గరున్న బహుమతులు అందించాను. అంతే.. సంతృప్తిగా అవి దారినిచ్చాయి. అయితే, కొద్ది సేపటికే నాగా గిరిజనులు నన్ను అడ్డగించారు. నా వస్తువులన్నిటినీ లాక్కున్నారు. సరిగ్గా అప్పుడే అద్భుతం జరిగింది. ఏనుగులు నా వెనకే వస్తూ గిరిజనులను చెల్లాచెదురు చేశాయి. నా బ్యాగును మోసుకుంటూ, నాతోపాటే రోడ్డు వరకూ నడిచాయి. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అదే..’’ అంటూ తన అనుభవాలు పంచుకున్నాడు బగీచా.