ఈ పదేళ్ల పాపపై ప్రపంచ దృష్టి
పుణె: పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారిపై తల్లిదండ్రుల ప్రభావమే అధికంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఏం కలలు కంటుంటారో, ఏది మంచి ఏది చెడు అని చెప్తుంటారో సహజంగా అదే వారి మనసులో నాటుకుపోయి ఆ ప్రభావం వారిపై చెరిపేయలేని స్థాయిలో ఉండిపోతుంది. అది ఎంతమేరకు ప్రభావం ఉంటుందో, అలాంటి ప్రభావం వారిపై ఏ విధమైన ఒత్తిడి కలగజేస్తుందో.. అసలు వారికి ఏం కావాలో అనే విషయాన్ని పుణెకు చెందిన ఇషితా కాత్యాల్ అనే బాలిక అనర్గలంగా చెప్పింది.
సాధారణంగా పెద్దపెద్దవాళ్లే వేదికపైకి ఎక్కి మాట్లాడేందుకు తటపటాయించే ఈ రోజుల్లో ఈ గడుగ్గాయి అతిరథమహారథులు పంచుకున్న వేదికపైకి ఎక్కి వారికి గుక్క తిప్పుకోలేని ప్రశ్నలు వేసింది. పిల్లల తరుపున తనొక్కతే ఒకల్తా పుచ్చుకొని వారి భావాలను బయటపెట్టింది. పుణెలో చదువుతున్న ఇషితా కాత్యాల్ అనే పదేళ్ల బాలిక ఈ ఏడాది కెనడాలో నిర్వహించిన టెక్నాలజీ, ఎంటర్ టైన్మెంట్, డిజైన్ (టీఈడీ) కార్యక్రమంలో ప్రారంభ ప్రసంగాన్ని చేసింది. ఆమె అలా చేస్తున్నప్పుడు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన టెక్నాలజీ మేథావులు, వ్యాపార వేత్తలు, గొప్పగొప్ప తత్వవేత్తలు ఉన్నారు.
వీరంతా ఇషితా ప్రసంగం చేస్తున్న సమయంలో కిక్కురుమనకుండా కూర్చుండిపోయారు. ఆమె ప్రశ్నలు అడిగే తీరు సమాధానాలు చెబుతున్న తీరు మేథావులను కూడా ఆలోచనలో పడేసింది. 'పిల్లలు పెరిగే క్రమంలో అసలు వారు ఏంకావాలని కోరుకుంటారో మీకు తెలుసా.. మీరు కచ్చితంగా వారిని అలా అడగాలి కానీ ఎప్పుడైనా అడిగారా' అంటూ ఇషితా నిలదీసింది.
'మా కలలు తీసి పారేయకండి. మేం ఈ సమయంలో చాలా చేయగలం. మన ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే చాలా శక్తులు పిల్లల కలలకు వ్యతిరేకంగానే పనిచేస్తూనే ఉన్నాయి. మాకంటూ ఓ ప్రత్యేక భవిష్యత్ ఉంది. నా కల ఏమిటంటే.. పాఠశాల స్కూల్ ఫీజులు పెంచేముందు పదిసార్లు ఆలోచించాలి. మరో దేశంపైకి యుద్ధానికి పోయేముందు వందసార్లు ఆలోచించాలి. నీరు, ఆహారం వృధా చేసేముందు వెయ్యిసార్లు ఆలోచించాలి. అలాగే, తమ చిన్నారులు, వారి బాల్య జీవితం సాగుతున్న క్రమంలో వారి తల్లిదండ్రులు పదివేలసార్లు ఆలోచించాలి. ఇలా చేస్తే బాగుంటుందనేది నా కల' అని చెప్పింది.