
సాక్షి, న్యూఢిల్లీ: సోలార్, విండ్ పవర్ రంగాల్లో 2022 నాటికి దేశంలో 3 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి ఆర్.కె.సింగ్ మంగళవారం రాజ్య సభలో చెప్పారు. దేశంలో 2022 నాటికి రెన్యూవబుల్ ఎనర్జీ రంగం 175 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, దేశంలో సోలార్ ఎనర్జీ రంగం స్థిరంగా పురోగతి సాధిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోందని వివరించారు.
ప్రభుత్వం సైతం సోలార్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అందులో భాగంగానే సోలార్ ఎనర్జీ రంగంలోకి దిగుతున్న కంపెనీలకు అతి తక్కువ జీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీలో రాయితీలు, పదేళ్ళపాటు ఆదాయ పన్ను మినహాయింపు, వయబులిటీ గ్యాప్ ఫండింగ్ వంటి పలు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే సోలార్ పార్క్‌ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ల ఏర్పాటు, సువిశాలమైన ప్రభుత్వ భవనాలు, సముదాయాలలో రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం, రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్ కలిగిన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లకు మాత్రమే ఇంటి రుణాలు ఇచ్చే నిబంధన ఈ చర్యలలో భాగమే అని మంత్రి అభివర్ణించారు.