న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) షాకిచ్చింది. బుధవారం నుంచి మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో వాస్తవంగా ఖర్చయిన రూ.18,92,353 కంటే వ్యయాన్ని అతితక్కువగా చూపడంతో పాటు సరైన వివరణ ఇవ్వకపోవడంతోనే ఈ చర్య తీసుకున్నట్లు ఈసీ తెలిపింది.
ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 10ఏ కింద కోడాపై వేటు వేస్తూ సీఈసీ ఏకే జోతి, కమిషనర్ ఓపీ రావత్ ఉత్తర్వులు జారీచేశారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని సింఘ్‌భూమ్ నియోజకవర్గం నుంచి కోడా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. కోడా సమర్పించిన ఎన్నికల వ్యయం వివరాలు తప్పులతడకగా ఉండటాన్ని గుర్తించిన ఈసీ..ఎందుకు అనర్హత వేటు వేయకూడదో తెలపాలంటూ 2010లో నోటీసులు జారీచేసింది.