తల్లి శవం భుజంపై.. జవానుకు ఎంత కష్టం?
కశ్మీర్: ఈ మధ్య చనిపోయిన తమ ఆత్మబంధువులను భుజాలపైన వేసుకొని వెళ్లిన సంఘటనలు ఎక్కువగా మనం ఒడిశా రాష్ట్రంలో చూశాం. ఇలా అనకూడని విషయమే అయినా వారంతా కూడా ఎవరి కళ్లకు సరిగా కనిపించని వాళ్లు.. అంటే బలహీనులు.. వర్గ పరంగా.. ఆర్థికపరంగా.. సామాజికపరంగా ప్రభుత్వాలు దయచూపనంతకాలం ఇంకొన్ని తరాల వరకు వారి బతుకులకు అలాంటి తిప్పలు తప్పవు. కానీ, అలాంటి పరిస్థితి ఒక జవానుకు వస్తే.. తల్లిని మోసుకొని విరిగిపడిన మంచుకొండలను దాటుకుంటూ వెళ్లాల్సి వస్తే.. అది కచ్చితంగా వార్తల్లో నిలుస్తుంది.. వేరే వాళ్లు చూస్తే అది దేశానికి అవమానం.
కానీ, అలాంటి సంఘటనే జరిగింది. మహ్మద్ అబ్బాస్ అనే వ్యక్తి పఠాన్ కోట్‌లో జవానుగా పనిచేస్తున్నాడు. అతడితోపాటు తన తల్లి కూడా జీవిస్తోంది. ఆమె గత ఐదు రోజుల కిందట ప్రాణాలు కోల్పోయింది. దీంతో నియంత్రణ రేఖ వద్ద ఉన్న కర్ణా అనే గ్రామంలోకి తీసుకెళ్లి ఖననం చేయాలని అనుకున్నాడు. కశ్మీర్‌కు తన తల్లి మృతదేహంతో చేరుకున్నాడు. అయితే, 50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉండగా దారి మధ్యలో ఓ భారీ మంచుకొండచరియ విరిగి పడింది. దీంతో ఆ జవానుకు హెలికాప్టర్ సహాయం చేస్తామని పై అధికారులు చెప్పారు. వారి మాట విని తల్లి శవాన్ని అక్కడే ఉంచి హెలికాప్టర్ కోసం ఎదురుచూశాడు. కానీ, హెలికాప్టర్ రాలేదు. దీంతో ఆమె మృతదేహాన్ని తన భుజాన వేసుకొని దాదాపు ఆరు మీటర్ల మేర పేరుకుపోయిన మంచులో నుంచి పది గంటలపాటు మరికొంతమంది సహాయకులతో దాటి ఖననం చేసేందుకు తీసుకెళ్లాడు.
దీనిపై అతడు వివరణ ఇస్తూ ‘ఇది చాలా పెద్ద అవమానం. నా తల్లికి గౌరవ ప్రదంగా అంత్యక్రియలు చేయలేకపోయాను. హెలికాప్టర్ పంపిస్తామని చెప్పి పంపించలేదు. పేరుకుపోయిన మంచుముక్కలపై ప్రమాద కర స్థితిలో నడుచుకుంటూ నా తల్లి మృతదేహాన్ని భుజాన వేసుకొని తీసుకెళ్లాను. నాలుగు రోజులు శవంతో ఎదురుచూసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ రోజు నా ఫోన్ కూడా కట్ చేశారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది’ అని చెప్పాడు. అయితే, తాము ఈ రోజే హెలికాప్టర్ సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. వారే హెలికాప్టర్ దిగే చోటులేదని వద్దన్నారని వివరించారు.