న్యూఢిల్లీ: అనునిత్యం ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాలతో రద్దీగా కనిపించే ప్రగతి మైదాన్ భద్రత కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్) ప్రత్యేక చర్యలు మొదలుపెట్టింది. ఇక్కడ పటిష్ట భద్రత కోసం 125 మంది జవాన్ల బృందాన్ని నియమించనుంది. ప్రగతి మైదాన్‌లో నిర్వహించే కార్యక్రమాలకు భద్రతాపరమైన ముప్పు ఉందనే హెచ్చరికలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ భద్రత కల్పన కోసం కేంద్ర హోంశాఖ విధివిధానాలను రూపొందిస్తున్నప్పటికీ.. వేదికల వద్ద విధుల నిర్వహణ కోసం ఢిల్లీ పోలీసులతో సమన్వయం నెరుపుతామని సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు అన్నారు.
ప్రగతి మైదాన్‌కు సాయుధ భద్రత కల్పించడం ఇదే తొలిసారి. వచ్చే నెల వరకు 125 మంది సీఐఎస్‌ఎఫ్ జవాన్ల బృందాన్ని పంపిస్తామని ఈ శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల అధీనంలో పనిచేసే భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ సూచన మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మనదేశ వాణిజ్య సంస్థల సత్తాను అంతర్జాతీయంగా చాటిచెప్పడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. 124 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రగతి మైదాన్‌లో 61,290 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 16 హాళ్లు ఉన్నాయి. మరో 10 వేల చదరపు మీటర్ల సువిశాల ప్రదర్శనప్రాంతం కూడా ఉంది. దీనికి సీఐఎస్‌ఎఫ్ 24 గంటల భద్రత కల్పిస్తోంది. ఏవైనా సంక్షోభ పరిస్థితులు తలెత్తితే దీనికి కూడా ఇబ్బందులు ఏర్పడుతాయి కాబట్టి గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ సీఎండీ రీటా మీనన్ గతంలోనే ప్రభుత్వాన్ని కోరారు.
ప్రగతి మైదాన్‌కు భారీ భద్రత
Published Thu, Aug 15 2013 7:29 PM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement