
సాక్షి, చెన్నై : ‘నేను స్నానం చేస్తుండగా గవర్నర్ బాత్‌రూమ్‌లోకి తొంగి చూశారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోండి’ అంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ‘ఆ పెద్దమనిషి చర్య నన్ను షాక్‌కు గురిచేసిందం’ని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
ప్రజాక్షేత్రంలోకి వెళ్లి సమస్యలను తెలుకునే ఉద్దేశంతో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ శుక్రవారం కడలూరు జిల్లాలో పర్యటించారు. అధికారులతో సమీక్షా సమావేశాల అనంతరం.. వీధివీధి, ఇల్లిల్లూ తిరుగుతూ పరిస్థితులను ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ ఇంటిలోకి వెళుతూ.. పక్కనున్న మరుగుదొడ్డిలోకి తొంగిచూశారు. లోపల ఓ మహిళ స్నానం చేస్తుండటంతో క్షణంలో వెనుకడుగువేశారు.
అయితే, గవర్నర్ చర్యకు షాక్ తిన్న మహిళ కాసేపటికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించిన గవర్నర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో గవర్నర్ వెంట కడలూరు కలెక్టర్, అధికార ఏఐడీఎంకేకి చెందిన కొందరు నేతలు కూడా ఉన్నారు. మరోవైపు గవర్నర్ పర్యటనను నిరసిస్తూ ప్రతిపక్ష డీఎంకే కడలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించింది. మహిళ ఫిర్యాదుపై గవర్నర్‌గానీ, రాజ్‌భవన్‌గానీ ఇంకా స్పందించాల్సిఉంది.
కాన్వాయ్ ఢీకొని ఇద్దరి మృతి
గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ భద్రతా సిబ్బంది వాహనం ఢీకొని ఇద్దరు మృతిచెందారు. కడలూరు-చెన్నై మార్గంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది.