
‘రోడ్డు మీద నడవడం పౌరుల హక్కు’
న్యూఢిల్లీ: పట్టణాల్లో, ముఖ్యంగా నగరాల్లో రోడ్డుమీద నడవాలంటే, రోడ్డు దాటాలంటే పాదాచారులకు ఎంతో కష్టమో మనందరికి నిత్యానుభవమే. ఒకప్పుడు పట్టణాల్లో, ముఖ్యంగా నగరాల్లో రోడ్ల మీద నడవాలంటే రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లు లేదా సైడ్‌వాక్‌లు ఎక్కువగా ఉండేవి. ఇక రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్‌లు, వాటివద్ద పాదాచారులకు సిగ్నల్ క్రాసింగ్‌లు ఉండేవి. వాహనాల రద్దీ పెరగడంతో రోడ్ల విస్తరణ పేరిట ఫుట్‌పాత్‌లు, జీబ్రా క్రాసింగ్‌లు కనుమరుగవుతూ వచ్చాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా పాదాచారులకు ప్రత్యేకదారులు, జీబ్రా క్రాసింగ్‌లు 30శాతానికి మించి లేవు. కొన్నిచోట్ల ప్లైఒవర్ వంతెనలు వచ్చినా అవి అన్ని చోట్ల అందుబాటులో లేవు. ఉన్నా వయోవద్ధులకు అవి ఉపయోగపడడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో పట్టణ ప్రాంతాల్లో రోడ్డు దాటడం ప్రమాదకరమేనని ప్రతి పది మంది పాదాచారుల్లో తొమ్మిది మంది ఓ జాతీయ సర్వేలో అభిప్రాయపడ్డారు. రోడ్డు మీద నడిచే హక్కు, రోడ్డు దాటే హక్కు పాదాచారులకు లేదా? రోడ్లపై వాహనాలను నడిపే హక్కు వాహనదారులకే ఉందా? వచ్చిపోయే వాహనాలను చూసుకొని భద్రంగా దాటాల్సిన బాధ్యత పాదాచారులదేనా? వారు భద్రంగా రోడ్డు దాటేలా దారి ఇవ్వాల్సిన బాధ్యత వాహనదారులది కాదా? అయినప్పటికీ రోడ్డు ప్రమాదం జరిగితే అందుకు ఎవరు బాధ్యులవుతారు? అన్న ప్రశ్నలు తలెత్తడం కూడా సహజం.
ఈ విషయం స్పష్టం చేయడానికి సరైన కేంద్ర చట్టాలు లేవుగానీ, రోడ్డు మీద నడవడం పాదాచారుడి హక్కని, ఆ హక్కుకు భంగం కలిగించకపోవడమే కాకుండా పాదాచారుడికి దారివ్వాల్సిన బాధ్యత కూడా వాహనదారులదేనని పలు కోర్టు తీర్పులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో పాదాచారుడు గాయపడితే అందుకు బాధ్యత వహించాల్సింది కూడా వాహనదారుడే. వీటిని పట్టించుకోకుండా వాహనదారులు, రోడ్డు మీద వెళ్లే హక్కు తమదేనన్నట్లుగా దూసుకుపోతుంటారు. కొన్ని చోట్ల ఫుట్‌పాత్‌ల మీదుగా కూడా వాహనాలు వెళుతుంటాయి. పాదాచారులు రోడ్డు దాటేందుకు చేతులుచాచి ఆపినాగానీ వాహనదారులు ఆగని సందర్భాలు మన దేశంలో అనేకం. అందుకే దేశంలో ప్రతి ఏడాది సంభవిస్తున్న ప్రమాదాల్లో 400 మంది మరణిస్తుంటే వారిలో 20 మంది పాదాచారులే ఉంటున్నారన్నది ప్రభుత్వ అధికారుల లెక్క. కానీ వాస్తవానికి పాదాచారుల మతుల సంఖ్య అనధికారికంగా రెండింతలు ఉంటోంది.
‘రోడ్లపై నడిచే హక్కు దేశంలోని ప్రతి పౌరుడికి ఉంది. అది పౌరుడి సొంత రిస్క్ అని భావించడం తప్పు. పాదాచారుల భద్రతను దష్టిలో పెట్టుకొని వాహనాలను నడపడం వాహనదారుల బాధ్యత’ అంటూ హైకోర్టులు గతంలోనే తీర్పులను ఇచ్చాయి.
ఈ విషయంలో సరైనా చట్టాలు చేయాలంటూ వివిధ ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగా, ఆ బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించి కేంద్రం చేతులు దులుపుకుంది. ఈ విషయమై ఇటీవల ఓ ట్రాఫిక్ అడ్వైజర్ పంజాబ్, హర్యానా కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. రోడ్డు మీద నడిచే హక్కును పౌరుడి ప్రాథమిక హక్కుగా గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై తీర్పు వెలువడితే పాదాచారుల కష్టాలు తీరవచ్చు.