సారీ చెప్పిన చాణక్య, ప్రణయ్ రాయ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఊహించడంలో తాము పొరపాటు చేశామని, దాంతో ప్రజలను కూడా అయోయమానికి గురిచేశామని.. అందుకు క్షమాపణ చెబుతున్నామని టుడేస్ చాణక్య ప్రతినిధులు, ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ చెప్పారు. ప్రణయ్ రాయ్ ఒక వీడియో సందేశం ద్వారా ఇది ఎలా జరిగిందో వివరిస్తే, టుడేస్ చాణక్య ట్విట్టర్ ద్వారా తన క్షమాపణలను ప్రకటించింది. తమ సర్వే నిపుణులు ప్రజల నాడి పట్టడంలో విఫలమైనట్లు ఇద్దరూ ఒప్పుకొన్నారు. ప్రణయ్ రాయ్ దాదాపు 30 ఏళ్ల నుంచి ఎన్నికల విశ్లేషణలో నిపుణుడిగా పేరొందారు. ఆయన అంచనాలు కూడా ఈసారి తలకిందులు కావడం గమనార్హం.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి దాదాపు 150 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని టుడేస్ చాణక్య, ఎన్డీటీవీ బల్లగుద్ది మరీ చెప్పాయి. ఎన్డీటీవీ తాను తొలుత ఇచ్చిన అంచనాలను సవరించుకుంటూ శుక్రవారం రాత్రి ఎన్డీయే విజయం ఖాయమని చెప్పింది. ఆదివారం ఉదయం కూడా తొలి గంట సమయంలో ఆధిక్యాలు ఎన్డీయే కూటమికి అనుకూలంగా ఉండటంతో.. ఇదే ట్రెండు కొనసాగితే ఎన్డీయే అధికారం చేపట్టడం ఖాయమంటూ ప్రఖ్యాత ఎన్నికల విశ్లేషణ నిపుణుడు ప్రణయ్ రాయ్ చెప్పారు. కానీ, ఆ అంచనాలు తలకిందులయ్యాయి. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ఎన్డీయే కూటమి కేవలం 58 స్థానాలు మాత్రమే సాధించగలిగింది.