'సెల్‌ఫోన్ల వల్లే బాలికలపై అత్యాచారాలు'
లక్నో: వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజంఖాన్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. మొబైల్ ఫోన్ల వల్లే ఢిల్లీలో రెండేళ్ల చిన్నారిపై ఇద్దరు టీనేజ్ బాలురు అత్యాచారం జరిపిన ఘటన చోటుచేసుకున్నదని పేర్కొన్నారు.
'రెండేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన వెనుక వాస్తవాన్ని మనం గుర్తించాల్సిన అవసరముంది. ఆ వాస్తవమే మొబైల్ ఫోన్. అందులో ఎలాంటి ఖర్చు లేకుండా చూడగలిగే విషయాలు. గ్రామీణ ప్రాంతాల్లో 14, 15 ఏళ్ల బాలల చేతిలో కూడా మొబైల్ ఫోన్ ఉంటున్నది. ఈ ఫోన్లలో రెండేళ్ల చిన్నారులకు సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలు సైతం ఉంటున్నాయి' అని ఆయన ఓ మీడియా సంస్థతో పేర్కొన్నారు.
'మొబైల్ ఫోన్లలోని వీటిని మనం ఎలా ఎదుర్కొంటున్నాం? ఎలా శిక్షిస్తున్నాం? ఈ వీడియోలు యావత్ యువతరాన్ని నాశనం చేస్తున్నాయి. వాళ్లు వయస్సులోకి రాకముందే ప్రభావాన్ని చూపుతున్నాయి' అని ఆయన పేర్కొన్నారు. ఆజంఖాన్ వ్యాఖ్యలకు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. 'స్మార్ట్ ఫోన్లు రాకముందు మన దగ్గర అత్యాచారాలు, దుర్మార్గాలు లేనేలేవు కదా' అంటూ చమత్కరించారు. ఢిల్లీలో గత శుక్రవారం రామ్‌లీలా నాటకం కొనసాగుతుండగా.. ఇద్దరు బాలురు రెండేళ్ల బాలికను అపహరించి.. లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాధిత చిన్నారి తీవ్రంగా గాయపడింది.