ఇంటర్‌లో పాసైంది 36 శాతం మందే!! | toppers scam effect, only 36 percent clear class 12 exams in bihar | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో పాసైంది 36 శాతం మందే!!

Published Tue, May 30 2017 3:32 PM | Last Updated on Thu, Jul 18 2019 2:07 PM

ఇంటర్‌లో పాసైంది 36 శాతం మందే!! - Sakshi

ఇంటర్‌లో పాసైంది 36 శాతం మందే!!

గతంలో బిహార్‌లో వెలుగుచూసిన టాపర్ల స్కాం ప్రభావం ఈసారి గట్టిగానే కనిపించింది. బిహార్ బోర్డు పరీక్షలలో ఇన్నాళ్లూ భారీ మొత్తంలో లంచాలు ఇవ్వడం ద్వారా మార్కులు సంపాదించిన విద్యార్థులు.. ఈసారి ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించడంతో తేలిపోయారు. ఈ సంవత్సరం నిర్వహించిన 12వ తరగతి (ఇంటర్) పరీక్షలలో కేవలం 36 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.. 64 శాతం మంది ఫెయిలయ్యారు. పరీక్ష దరఖాస్తులను నింపే దగ్గర నుంచి పేపర్లు దిద్దేవరకు అన్ని అంశాల్లోను చాలా కఠినంగా వ్యవహరించామని, పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నామని, ఆన్సర్ షీట్ల బార్‌కోడింగ్ ఉపయోగించి ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా చూసుకున్నామని బిహార్ పరీక్షల బోర్డు చైర్మన్ ఆనంద్ కిషోర్ తెలిపారు. దాంతో అక్కడి విద్యార్థుల బండారం బటయపడింది. కేవలం 36 శాతం మంది మాత్రమే పాసయ్యారు.

12వ తరగతి పరీక్షలలో సైన్స్, కామర్స్, ఆర్ట్స్ అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 12,40,168 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వారిలో 7,94,622 మంది ఫెయిలయ్యారు. కామర్స్‌లో అత్యల్పంగా 25 శాతం మంది ఫెయిలైతే, అత్యధికంగా సైన్స్ స్ట్రీమ్‌లో 69.52 శాతం మంది ఫెయిలయ్యారు. అలాగే ఈసారి టాపర్ల మార్కులు కూడా మరీ ఎక్కువగా ఏమీ రాలేదు. సైన్స్ విభాగంలో 500కు గాను 431 మార్కులు (86.2 శాతం) సాధించిన ఖుష్బూ కుమారికి మొదటి ర్యాంకు వచ్చింది. కామర్స్ విభాగంలో 500కు 408 మార్కులు (81.6 శాతం) సాధించిన ప్రియాన్షు జైస్వాల్, ఆర్ట్స్ విభాగంలో 500కు 413 (82.6 శాతం) సాధించిన గణేష్ కుమార్ మొదటి ర్యాంకులు సాధించారు. టాపర్లందరి పేపర్లను మరోసారి నిపుణుల సమక్షంలో రీవాల్యుయేషన్ చేశారు. ఆ తర్వాత మాత్రమే ఫలితాలు ప్రకటించారు. ఈసారి టాపర్లుగా నిలిచిన వారికి నగదు బహుమతులు, ల్యాప్‌టాప్‌లు ప్రకటించారు. మొదటి ర్యాంకు వస్తే రూ. 1 లక్ష, రెండో ర్యాంకు వస్తే రూ. 75 వేలు, మూడో ర్యాంకు వస్తే రూ. 50 వేలు, నాలుగో ర్యాంకు, ఐదో ర్యాంకు వస్తే రూ. 10 వేల వంతున ఇవ్వడంతో పాటు మొదటి ఐదు ర్యాంకులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement