ఆలయంలో మద్యం సీసాలతో ఫారిన్ జంట
హంపీ: హిందువులు పరమ పవిత్రంగా భావించే ఆలయంలో ఓ విదేశీ పర్యాటకుడు మద్యం సీసాతో ప్రవేశించడం కలకలం రేపింది. ఒక్కసారిగా ఆలయం మొత్తం ఉద్రిక్త పరిస్థితిని నెలకొల్పింది. ప్రవేశ ద్వారం వద్దే అతడిని అడ్డుకొని వెనక్కి పంపించినా ఖాతరు చేయకుండా మళ్లీ ప్రవేశించడంతో పలువురు ఆలయ ధర్మకర్తలకు, కార్యకర్తలకు, భక్తులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అతడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన హంపీలోని విరుపాక్ష ఆలయంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గుర్తు తెలియని ఆ టూరిస్టు హాలండ్ ప్రాంతానికి చెందినవాడని అంటున్నారు.
యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయ ప్రాంగణంలో, ఆవరణంలో మద్యపానంపై నిషేధం ఉంది. అలాంటిది అతడు మాత్రం ఏకంగా ఆలయం లోపలికి మద్యంతో అడుగుపెట్టాడు. తొలుత మేం చెప్పగానే అతడు తన పార్టనర్‌తో కలిసి బయటకు వెళ్లినప్పటికీ ఐదు నిమిషాల తర్వాత వెనక్కు వచ్చారు. అయితే, ఎవరికీ కనిపించకుండా అతడి దుస్తుల వెనుక దాచుకొని మళ్లీ తెచ్చుకున్నాడు. దీంతో గట్టి వార్నింగ్ ఇచ్చి వెనక్కి పంపించాం’ అని సేవ్ హంపీ ఉద్యమకారుడు రచ్చయ్య తెలిపారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని, ఆ టూరిస్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళనకు దిగారు. ప్రస్తుతానికి పోలీసులు ఆ టూరిస్టుకోసం ప్రయత్నిస్తున్నారు.