సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. ఇప్పటి వరకు కేవలం వైరస్ బారినపడిన, అనుమానితులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా వైరస్ వ్యాప్తిని కట్టడిచేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగంచెల వ్యూహంతో కరోనా సోకిన వారిని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నియంత్రణకు దక్షిణ కొరియా అనుసరించిన విధానాలను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై పలు విషాయలను కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్థన్ ఆదివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దేశంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సరికొత్త విధానాలను అనుసరించాలని కేంద్రప్రభుత్వం సంకల్పించిందని మంత్రి తెలిపారు. (కేంద్రమంత్రిని వెంటాడుతున్న కరోనా భయం!)
దీనిలో భాగంగానే వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం (ట్రేస్) పరీక్షలు నిర్వహించడం (టెస్ట్) క్వారెంటైన్‌కు పంపడం (ఐసోలేషన్) వైద్య చికిత్స అందించడం (ట్రీట్) లాంటి వ్యూహాన్ని అమలుపరుస్తున్నట్లు హర్షవర్ధన్ వెల్లడించారు. దీని వల్లన వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే నగర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించాలని కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు. మే చివరి నాటికి రోజుకు లక్ష పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, లాక్‌డౌన్, సామాజిక దూరంతోనే పూర్తిగా అంతం చేయగలమని అన్నారు. (ఒక్కరోజులో 1,975 కేసులు)
కాగా దక్షిణ కొరియా ఎలాంటి కఠిన చర్యలు పాటించకుండానే విజయవంతంగా కోవిడ్19 మహమ్మారిని తమ దేశంలో నిరోధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29న దక్షిణ కొరియాలో అత్యధికంగా 909 కేసులు నమోదు కాగా, మార్చి 17 నాటికి ఇది 74 కేసులకు తగ్గింది. పెద్ద ఎత్తున వైరస్ బాధితులను గుర్తించి పరీక్షలు నిర్వహించడంలో ఆ దేశం విజయవంతం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ దేశం అనుసరించిన విధానాల వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా అదే బాటలో నడవాలని భావించింది.
మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఆగడం లేదు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 1,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 24 గంటల వ్యవధిలో 47 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 27,892కు, మరణాల సంఖ్య 872కు చేరిందని ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment