
సాక్షి, చెన్నై: ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వం ఉండగా, ఆ ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటూ సమీక్షలు, సమాలోచనలు సాగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి వ్యాఖ్యానించారు. అందుకే గవర్నర్‌పై కోర్టులో పిటిషన్ వేయనున్నట్టు శనివారం ప్రకటించారు. ఓ ప్రైవేటు కళాశాలలో అవినీతి వ్యతిరేక కమిటి సర్వోదయా మరు ముళక్కం నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సదస్సుకు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి హాజరయ్యారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా విఫలమైందని, కేవలం ఎలాగైనా ఎన్నికలు పూర్తి చేయాలనే ముందుకు సాగారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అధికార పక్షం రూపంలో ఖూనీ చేసినా, ప్రజలు న్యాయమైన తీర్పునే ఇస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. డీఎంకే, లేదా దినకరన్‌కు విజయావకాశాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. జయలలిత మరణం మిస్టరీ తేల్చేందుకు విచారణ సాగుతున్న సమయంలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్న వీడియో బయటకు రావడాన్ని తప్పు బట్ట లేమని వ్యాఖ్యానించారు.
ఇలాంటి వీడియో ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఎప్పుడో విడుదల చేసి ఉండాలని పేర్కొన్నారు. రోడ్డు పక్కన బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధించాలని కోర్టులో తానే కేసు వేశానని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం వాటిలో జీవించి ఉన్న వారి ఫొటోలు పెట్టుకునే విధంగా అనుమతి వచ్చిందని, దీనిపై తగిన వివరాల్ని కోర్టుకు సమర్పిస్తానని, కొన్ని నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఆ అధికారం గవర్నర్‌కు లేదు..
రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. ఆయన సమీక్షలు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అసలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే అధికారం గవర్నర్‌కు లేదని వ్యాఖ్యానించారు. జిల్లాల్లో అధికారులతో సమీక్షలు, సమావేశాలు, ప్రభుత్వ పథకాల తీరు తెన్నుల మీద గవర్నర్ దృష్టి పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధంగా పేర్కొన్నారు.
ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వం పాలనలో ఉందన్న విషయాన్ని మరచి, గవర్నర్ ప్రజాస్వామ్య విరుద్ధంగా నడుచుకుంటున్నారని మండిపడ్డారు. గవర్నర్ తన ధోరణి మార్చుకోని పక్షంలో త్వరలో ఆయన మీద కోర్టులో పిటిషన్ వేస్తానని ట్రాఫిక్ రామస్వామి హెచ్చరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment