వనీ వారసుడి హతం | Tral gunfight; two militants including Sabzar killed | Sakshi
Sakshi News home page

వనీ వారసుడి హతం

Published Sun, May 28 2017 12:53 AM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

వనీ వారసుడి హతం

వనీ వారసుడి హతం

హిజ్బుల్‌ కమాండర్‌ సబ్జార్‌ భట్‌ ఎన్‌కౌంటర్‌
► కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ బృందంపై ఉగ్రవాదుల కాల్పులు
► ఇంటిని చుట్టుముట్టి అంతమొందించిన భద్రతా బలగాలు
►  యువత ‘ఉగ్ర’ ఆకర్షణలో భట్‌ పాత్ర కీలకం
►  రాంపూర్‌ సెక్టార్‌లో ఆరుగురు మిలిటెంట్ల ఎన్‌కౌంటర్‌


శ్రీనగర్‌: కరడుగట్టిన ఉగ్రవాది, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ సబ్జార్‌ అహ్మద్‌ భట్‌ (26)ను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. హిజ్బుల్‌ మాజీ కమాండర్‌ బుర్హాన్‌ వనీ హతమయ్యాక లోయలో ఉగ్ర కార్యక్రమాల్లో కీలకంగా మారిన భట్‌ను శనివారం భారత ఆర్మీ మట్టుబెట్టింది. దీంతో ఉగ్రవాద విస్తరణను అడ్డుకోవటంలో భద్రతాబలగాల ప్రయత్నం మరో అడుగు ముందుకుపడింది. కరడుగట్టిన ఉగ్రవాది బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ తర్వాత లోయలో హిజ్బుల్‌ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లటంలో, యువతను ఆకర్షించటంలో భట్‌ క్రియాశీలకంగా వ్యవహరించాడు.

పుల్వామా జిల్లాలోని త్రాల్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో సబ్జార్‌తోపాటుగా మరో మిలిటెంట్‌ హతమయ్యాడు. మరికొందరు హిజ్బుల్‌ ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో త్రాల్‌లోని సైమూ గ్రామంలో ఆర్మీ కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తోంది. కాగా, ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌ సమయంలో బుల్లెట్‌ గాయాలైన ఓ స్థానికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. సబ్జార్‌ ఎన్‌కౌంటర్‌తో లోయలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు, రాంపూర్‌ సెక్టార్‌లో భారత్‌లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన ఆరుగురు మిలిటెంట్లను కూడా సరిహద్దు బలగాలు మట్టుబెట్టాయి.

ఎన్‌కౌంటర్‌ ఎలా జరిగింది?
లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను ఏరివేసేందుకు అనుమానాస్పద గ్రామాల్లో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్లను ఆర్మీ విస్తృతం చేసింది. శ్రీనగర్‌కు 36 కిలోమీటర్ల దూరంలోని పుల్వామా జిల్లా సైమూ గ్రామంలోనూ కార్డన్‌ సెర్చ్‌ కోసం భద్రతా బలగాలు శుక్రవారం రాత్రి వచ్చాయి. గ్రామంలోని ఓ వీధి గుండా వెళ్తుండగా.. సమీపంలోని ఇంటినుంచి ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. అప్రమత్తమైన భద్రతా బలగాలు, కశ్మీర్‌ పోలీసులు గ్రామం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా చుట్టుముట్టాయి.కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదులు పక్కనున్న ఓ పాత భవనంలోకి, దాని పక్కనున్న మరో ఇంట్లోకి ప్రవేశించారు.

దీన్ని గమనించిన బలగాలు ఆ రెండు ఇళ్లను చుట్టుముట్టడంతోపాటుగా గ్రామంలోని మిగిలిన ఇళ్లలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. అయితే శుక్రవారం రాత్రి కాసేపటికి కాల్పులు ఆగిపోయాయి.  లోపలున్న ఉగ్రవాదులను తప్పించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడి, రాళ్లు రువ్వుతూ భద్రతా బలగాల దృష్టి మరల్చేందుకు విఫలయత్నం చేశారు. వారిపై పోలీ సులు పెల్లెట్లు, బాష్పవాయును ప్రయోగించారు. పలువురు గ్రామస్తులకు గాయాలయ్యాయి. శనివారం వేకుజామున ఉగ్రవాదులు మళ్లీ కాల్పులు ప్రారంభించటంతో ఆర్మీ దీటుగా స్పందించింది. రెండు ఇళ్లనుంచి దట్టమైన మంటలు వ్యాపించటంతో ఉగ్రవాదులు పొగలో చిక్కుకుపోయారు. తర్వాత బలగాలు వీరిని మట్టుబెట్టాయి. ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇళ్ల శిథిలాల మధ్య మూడో ఉగ్రవాది చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఏడాదిలో రెండో భారీ దెబ్బ
వనీ ఎన్‌కౌంటర్‌ తర్వాతే భట్‌కు హిజ్బుల్‌ పగ్గాలు అందుతాయని భావించినా.. ఈ బాధ్యతలు జకీర్‌ ముసాకు అప్పగించారు. కానీ మే ప్రారంభంలో హురియత్‌ నేతలపై తీవ్రవ్యాఖ్యలు చేసిన మూసా హిజ్బుల్‌ బాధ్యతలనుంచి తప్పుకోవటంతో భట్‌కు వనీ వారసుడి స్థానం దక్కింది.ముసా మొదట్నుంచీ కాగితం పులేనని.. భట్‌ తెరవెనక ఉండి మొత్తం నడిపించేవాడని పోలీసు అధికారులు తెలిపారు. ముసా కన్నా భట్టే భద్రతాబలగాలు, పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నాడని వెల్లడించారు. గతంలోనే భట్‌ తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది.

  కాగా, 11 నెలల కాలంలోనూ ఇద్దరు హిజ్బుల్‌ కీలకమైన నేతలను మట్టుబెట్టడం లోయలో ఉగ్ర వ్యతిరేక కార్యక్రమాలకు మరింత ఊపునివ్వనుంది. కాగా, తాజా ఎన్‌కౌంటర్‌తో లోయలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండ్రోజుల పాటు బంద్‌ పాటించాలని హురియత్‌ పిలుపునిచ్చింది.  అనంత్‌నాగ్, పుల్వామా, శ్రీనగర్‌తోపాటు పలు జిల్లాల్లో ఇప్పటికే ఆందోళనలు మిన్నంటాయి. చాలా చోట్ల పోలీసులు, భద్రతా బలగాలపై యువకులు రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం.  

చొరబాటు కుట్ర భగ్నం
నియంత్రణ రేఖ వెంబడున్న రాంపూర్‌ సెక్టార్‌లో చొరబాటుకు యత్నించిన ఆరుగురు ఉగ్రవాదులను భధ్రతా బలగాలు మట్టుబెట్టాయి. శనివారం తెల్లవారుజామున సరిహద్దుల్లో అనుమానాస్పద కదలికలను గుర్తించిన బలగాలు కాల్పులు ప్రారంభించాయి. ఉగ్రవాదులు ప్రతిఘటించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆరుగురిని బలగాలు హతమార్చాయని ఆర్మీ వెల్లడించింది.

మరికొందరు ఉగ్రవాదులు తప్పించుకుని ఉండొచ్చన్న సమాచారంతో సరిహద్దుల్లో కూంబింగ్‌ కొనసాగుతోంది. తాజా ఘటనతో 24 గంటల్లో లోయలో హతమైన ఉగ్రవాదుల సంఖ్య 10కి చేరింది. శుక్రవారం ఉడీ సెక్టార్‌లో చొరబాటుకు యత్నించిన ఇద్దరు బ్యాట్‌ (పాకిస్తాన్‌ సరిహద్దు దళం) సభ్యులను బలగాలు హతమార్చిన సంగతి తెలిసిందే.

ఎవరీ భట్‌ ?
కశ్మీర్‌ లోయలో యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షించాలంటే.. యువతతో తరచూ కలుస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయాలి.   భట్‌  ఇందుకు పూర్తి విరుద్ధం. తను లోప్రొఫైల్‌ కొనసాగిస్తూనే చురుకుగా వ్యవహరించేవాడు. ఫొటోల్లో, ఇతర వేదికలపై తాను బహిరంగంగా కనిపించకుండానే పని చక్కబెట్టేవాడు. ఏడాదిన్నర క్రితం హిజ్బుల్‌లోకి రాకముందే లోయలో రాళ్లు విసురుతున్న యువకుల్లో భట్‌ ఒకడు. ఇదే సమయంలో పెళ్లి ప్రతిపాదన తిరస్కరణకు గురవటంతో ఉగ్రవాదంవైపు ఆకర్షితుడై తక్కువ సమయంలోనే బుర్హాన్‌ వనీకి అత్యంత సన్నిహితుడయ్యాడు.

త్రాల్‌లోని రథ్‌సునా గ్రామానికి చెందిన భట్‌ దక్షిణ కశ్మీర్‌లో హిజ్బుల్‌ విస్తరించటంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించాడు. లోయలో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించటంలో బుర్హాన్‌ వనీతోపాటుగా సబ్జార్‌ భట్‌ పాత్ర చాలా కీలకం. సోషల్‌ మీడియా ద్వారా యువతకు గాలం వేసి, జవాన్లపై  దాడికి ఉసిగొల్పటంలో వీరిద్దరూ క్రియాశీలంగా వ్యవహరించారు. లోయలోని హిజ్బుల్‌ బృందంలో వనీకి భట్‌ అంటేనే చాలా నమ్మకం.

సాంకేతికతను వినియోగించుకుని ఉగ్రకార్యక్రమాలను రూపకల్పన చేయటంలో భట్‌ దిట్ట. వనీ ఎన్‌కౌంటర్‌ తర్వాత (గతేడాది జూలై 8న) లోయలో అస్థిరత నెలకొల్పటం  భట్‌ వ్యూహమేనని తెలిపారు. మార్చిలో పుల్వామాలో ఓ ఇంట్లో దాక్కున్న భట్‌తోపాటు మరికొందరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఎన్‌కౌంటర్‌లో.. అప్పటికే ఓ పోలీసుతోపాటు ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. స్థానికులు రాళ్లు రువ్వటంతోపాటు ఎన్‌కౌంటర్‌ స్థలానికి చొచ్చుకురావటంతో భట్‌ పారిపోగలిగాడు.

ఉగ్రవాదంపై సరికొత్త వ్యూహంతో..
కొంతకాలంగా లోయలో ఉగ్రవాదులను తరచుగా భద్రతా బలగాలు మట్టుబెడుతున్నాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. ప్రత్యర్థుల అంచనాలను తిప్పికొడుతున్నాయి. శనివారం నాటి భట్‌ ఎన్‌కౌంటర్‌తో లోయలో పరిస్థితుల్లో మార్పు కనబడనుంది. పరిస్థితి మొత్తం ఆర్మీ చేతుల్లోకి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని సమాచారం. ఆర్మీ వ్యూహంలో ఇంతలా మార్పు రావటానికి కారణమేంటి? అదే మాజీ బీఎస్‌ఎఫ్‌ ఐజీ అశోక్‌ పటేల్‌ అనుసరించిన వ్యూహం. 1990–93 మధ్యలో పటేల్‌ లోయలో మిలిటెన్సీని నియంత్రించారు. నిఘా సమాచారం ఆధారంగా ఉగ్ర నేతలను మట్టుబెట్టడంపైనే దృష్టిపెట్టారు.

సమాచారం రాగానే కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ చేపట్టడం ఆపరేషన్‌ పూర్తి చేయటం పటేల్‌ వ్యూహం. ముస్లిం జాన్‌బాజ్‌ ఫోర్స్, జేకేఎల్‌ఎఫ్,  హిజ్బుల్లా వంటి గ్రూపుల నేతలను లక్ష్యం చేసుకుని ఈ సంస్థలను సమూలంగా నిర్మూలించారీయన. ఆ తర్వాత పాకిస్తాన్‌.. లష్కరే, హుజీలను కశ్మీర్‌కు పంపించింది. పదేళ్ల క్రితమే ఇవి కూడా ఉనికిని కోల్పోయాయి. ఐదేళ్ల క్రితం కొత్త సంస్థలు పుట్టుకొచ్చాయి. అయితే.. భట్‌ ఎన్‌కౌంటర్‌తో సంబరాలు జరుపుకోదలచుకోలేదని.. జూన్‌ చివరి వారం, జూలై మొదటి వారం తమకు చాలా కీలకమని దక్షిణ కశ్మీర్‌లో ఆపరేషన్లు చేస్తున్న విక్టర్‌ ఫోర్స్‌ చీఫ్, మేజర్‌ జనరల్‌ బీఎస్‌ రాజు తెలిపారు.

భట్‌ మృతితో హిజ్బుల్‌లో తీవ్రమైన నాయకత్వ సమస్య నెలకొందని.. లోయలో దీని ప్రభావం చాలా ఉంటుందని రాజు వెల్లడించారు. లోయలో లష్కరే చీఫ్‌గా ఉన్న అబు దుజానా ఈ బాధ్యతలు తీసుకొవచ్చని భావిస్తున్నారు. వనీ ఎన్‌కౌంటర్‌ తర్వాత హిజ్బుల్, లష్కరేతోపాటు ఇతర ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాలు మరింత ఎక్కువయ్యాయి. దీనికి దుజానా చొరవ తీసుకున్నారు. గతవారమే దుజానాను కార్డన్‌ సెర్చ్‌లో భద్రతా బలగాలు చుట్టుముట్టినా స్థానికుల సాయంతో అతను తప్పించుకున్నాడు. అయితే.. తాజా పరిణామాలతో దుజానాపైనా దృష్టిపెట్టి అతన్ని కూడా మట్టుబెట్టాలని సైన్యం వ్యూహాలు రచిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement