స్వచ్ఛ భారత్ కోసం మేకలు, నగలు తాకట్టు!
జైపూర్: ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ నినాదంతో ప్రేరణ పొందిన ఓ గిరిజనుడు తన వద్ద ఉన్న మేకలను, భార్య ఆభరణాలను తాకట్టు పెట్టి మరుగుదొడ్డి నిర్మించుకున్నాడు. రాజస్థాన్ లోని దుంగార్పూర్ జిల్లాకు చెందిన కాంతిలాల్ రాట్ తన అన్నయ్యతో కలిసి ఉమ్మడిగా ఉంటున్నాడు. అతనికి ప్రధానమంత్రి క్లీన్ ఇండియా మిషన్ గురించి స్థానిక కార్యకర్త వివరించారు. మరుగుదొడ్డి నిర్మిస్తే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీల నుంచి రూ.4000 వస్తాయని చెప్పాడు.
దీంతో కాంతిలాల్ పనులు ప్రారంభించాడు. ముందుగా అతనికి రూ.5000 వచ్చాయి. తర్వాత డబ్బులు రాలేదు. ఎలాగైనా టాయిలెట్ పూర్తి చేయాలనుకున్న అతను తన దగ్గరున్న నాలుగు మేకలను, భార్య వెండి ఆభరణాలను రూ.5000కు తాకట్టు పెట్టి టాయిలెట్ పనులను పూర్తిచేశాడు. విషయం తెలుసుకున్న దుంగార్పూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కేకే గుప్తా అతని ఇంటికి వెళ్లి అభినందించారు. అతనికి రూ. 4000 ఇచ్చి అతని మేకలను, ఆభరణాలను తాకట్టు నుంచి విడిపించారు.