సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో విపక్షాల నిరసనల నడుమ ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లు మంగళవారం రాజ్యసభ ముందుకొచ్చే అవకాశం ఉంది. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ఎట్టిపరిస్థితుల్లో గట్టెక్కించాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సభకు విధిగా హాజరు కావాలని పార్టీ రాజ్యసభ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినా రాజ్యసభలో ఈబిల్లు ఆమోదం ప్రభుత్వానికి అంత సులభం కాదు.
పెద్దల సభలో అధికార సభ్యుల కంటే విపక్ష సభ్యులు అధికంగా ఉండటంతో ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో గట్టెక్కించడం మోదీ సర్కార్‌కు సవాల్‌గా మారింది. ప్రధాన విపక్ష పార్టీలన్నీ బిల్లును వ్యతిరేకిస్తుండటం ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఓటింగ్‌కు వచ్చినప్పుడు కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే సహా పలు విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. బిజేపీ మిత్ర పక్షం జేడీ(యూ) సైతం ట్రిపుల్ తలాక్ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం కంటే ముందు ఈ బిల్లును పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు డిమాండ్ చేశాయి. మరోవైపు విపక్షాలు బిల్లును వ్యతిరేకిస్తున్నా లింగ సమానత్వం, న్యాయం దిశగా ఈ బిల్లును రూపొందించామని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment