న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ భాగస్వామ్య పక్షం జేడీ(యూ) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బిల్లుపై చర్చను ప్రారంభించిన మంత్రి ఇస్లామిక్ దేశాలు సైతం త్రిపుల్ తలాక్ ను నిషేధించాయని గుర్తు చేశారు.చిన్న చిన్న కారణాలతో ట్రిపుల్ తలాక్ చెబుతున్న ఉదంతాలు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చాయని తెలిపారు.బాధితురాలు, ఆమె రక్త సంబంధీకులకు మాత్రమే ట్రిపుల్ తలాక్ పై కేసు పెట్టే అధికారం ఇచ్చామని,ఈ బిల్లు మానవత్వానికి, న్యాయానికి సంబంధించినది మాత్రమేనని, మతంతో ముడిపడి లేదని స్పష్టం చేశారు.
మహిళల అభ్యున్నతి కోసమే తమ ప్రభుత్వం ఈబిల్లు తీసుకొచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఇక పెద్దల సభలో అధికార సభ్యుల కంటే విపక్ష సభ్యులు అధికంగా ఉండటంతో ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో గట్టెక్కించడం మోదీ సర్కార్‌కు సవాల్‌గా మారింది. ప్రధాన విపక్ష పార్టీలన్నీ బిల్లును వ్యతిరేకిస్తుండటం ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు.
లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఓటింగ్‌కు వచ్చినప్పుడు కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే సహా పలు విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. బిజేపీ మిత్ర పక్షం జేడీ(యూ) సైతం ట్రిపుల్ తలాక్ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం కంటే ముందు ఈ బిల్లును పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు డిమాండ్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment