
సాక్షి, న్యూఢిల్లీ: జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని.. ‘ఒక దేశం, ఒకే నీతి’ఉండాలని పేర్కొంటూ టీఆర్‌ఎస్ ఎంపీలు బుధవారం కూడా పార్లమెంటులో ఆందోళన చేశారు. బుధవారం ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే.. టీఆర్‌ఎస్ సభ్యులు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కవిత, సీతారాం నాయక్, బూర నర్సయ్యగౌడ్, నగేశ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పసునూరి దయాకర్, బాల్క సుమన్ తదితరులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.
ఇదే సమయంలో వివిధ అంశాలపై ఇతర పార్టీల సభ్యులు కూడా ఆందోళన చేపట్టడంతో.. గందరగోళం నెలకొని సభ వాయిదా పడింది. దాంతో టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి కొద్దిసేపు ధర్నా చేశారు. టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనా.. టీఆర్‌ఎస్, వైఎస్సార్‌కాంగ్రెస్, టీడీపీ, ఏఐఏడీఎంకే, శివసేన, కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యులు వివిధ అంశాలపై ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను గురువారానికి వాయిదా వేశారు.
కాగా ఆందోళన సందర్భంగా టీఆర్‌ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. సామాజిక, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రాష్ట్రాల్లోని ప్రజల అవసరాలు అక్కడి ప్రభుత్వాలకు మాత్రమే తెలుస్తాయని.. అందువల్ల రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని కేకే పేర్కొన్నారు. ‘‘విద్య, ఉద్యోగాల్లో జనాభా ఆధారంగా వారి కి రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది.
ఇది కేంద్ర ప్రభుత్వమైనా చేయాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వాలకైనా ఆ బాధ్యత ఇవ్వాలి. అత్యవసరం అనుకుంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. దానికి అనుగుణంగా రాష్ట్రంలోని స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకొనే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి..’’అని డిమాండ్ చేశారు.
అన్ని రాష్ట్రాలకు ఒకే నీతి ఉండాలి..
రిజర్వేషన్ల చట్టం సెక్షన్ 16(4)కు సవరణలు చేసి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకొనే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘‘దేశంలో ఒక రాష్ట్రానికి ఒక నీతి మరో రాష్ట్రానికి మరో నీతి ఉండకూడదు. సమాఖ్య భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే చట్టం ఉండాలి. తమిళనాడులో 69 శాతం, మహారాష్ట్రలో 52 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
అదే మాదిరిగా ఇతర రాష్ట్రాల్లోనూ జనాభా ప్రకారం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచుకొనే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలి..’’అని కోరారు. ఇదే విషయమై తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాయని, కానీ కేంద్రం స్పందించడం లేదని చెప్పారు. రిజర్వేషన్ల పెంపు అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించాలన్న డిమాండ్‌తో కేంద్రం దిగి వచ్చే వరకు పోరాడుతామని పేర్కొన్నారు.
రిజర్వేషన్ల పరిధిపై నియంత్రణేదీ లేదు
రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్రాలకే ఉండాలన్నదే టీఆర్‌ఎస్ ప్రధాన డిమాండ్ అని ఎంపీ కవిత చెప్పారు. దాని కోసం రెండేళ్లుగా పోరాడుతున్నామన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన 50 శాతం రిజర్వేషన్ల పరిధి రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆమె పేర్కొన్నారు.
రిజర్వేషన్లు పెంచుకోవచ్చని ఉందికానీ ఎక్కడా ఇంత శాతమే రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో లేదని స్పష్టం చేశారు. కేవలం సుప్రీంకోర్టు ఆదేశాలను సాకుగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను నియంత్రించాలని చూస్తోందని.. దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment