అప్రజాస్వామికం: టీఆర్‌ఎస్ ఎంపీలు
* ‘తెలంగాణ’ మనోభావాలు గాయపడ్డాయి
* ‘పోలవరం’ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతికి టీఆర్‌ఎస్ ఎంపీల నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తమ నిరసన తెలిపారు. ఈ ఆర్డినెన్స్ తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని, ముఖ్యంగా గిరిజనుల జీవితాలను దుర్భరం చేస్తుందని ఎంపీలు రాష్ట్రపతి ముందు తమ నిరసన గళం వినిపించారు. ‘పార్లమెంట్ ఆమోదంతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడం అప్రజాస్వామికం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లను పార్లమెంట్ ఆమోదిం చింది.
ఇప్పుడు ఈ బిల్లును కాదని ఆర్టికల్ 3ని పట్టించుకోకుండా రాష్ట్రాల సరిహద్దులు మారుస్తూ ఆర్డినెన్స్ తేవడం శ్రేయస్కరం కాదు. మరో వారం రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఇలాంటి ఆర్డినెన్స్‌పై మీరు సంతకం చేయడం తెలంగాణ ప్రజలను గాయపరిచింది. గిరిజన ప్రజల బతుకులను దుర్భరం చేసింది. దీన్ని మేము నిరసిస్తున్నాం’అని వారు లేఖరూపంలో రాష్ట్రపతికి తెలిపారు. గురువారం రాత్రి ఈ మేరకు ఎంపీలు వినోద్‌కుమార్, సీతారాం నాయక్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావులు రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రపతి స్పందిస్తూ ‘ప్రధాని పంపినందునే ఆర్డినెన్స్‌పై సంతకం చేశా. ఈ ఆర్డినెన్స్ పార్లమెంట్‌లో చట్టంగా మారే సమయంలో దీనిపై చర్చించండి. ఇక్కడ చెబుతున్నదే పార్లమెంట్‌లో చెప్పండి’ అని రాష్ట్రపతి సూచించారని తెలిపారు. దీనిపై తాము పార్లమెంట్‌లో పోరాడుతామని, అక్కడ బిల్లును అడ్డుకుంటామని స్పష్టం చేశారు.