
'మోదీ విజయంలాంటిదే ట్రంప్ గెలుపు'
అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో తాను ముందుగా చెప్పిందే జరిగిందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో తాను ముందుగా చెప్పిందే జరిగిందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకొని అవాక్కయ్యే ఆశ్చర్యంలో ముంచెత్తారని తెలిపారు. ట్రంప్ విజయం 2014 ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ సాధించిన విజయంలాంటిదని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన నేపథ్యంలో ఆయనను ఓ మీడియా స్పందన కోరగా ఈ విధంగా స్పందించారు.
'హిల్లరీ ప్రచారంలో ట్రంప్ను ఏమాత్రం పోటీకి యోగ్యుడుకాడని, చెత్త అభ్యర్థి అని ఆరోపించింది. కానీ, ఆ మాటలేవి ట్రంప్ ముందు నిలబడలేదు. బిల్ క్లింటన్ ఇంకా చాలా చెడ్డవాడు. నేను ట్రంప్ గెలుస్తాడనే అనుకున్నాను' అని స్వామి అన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చినంత మాత్రాన భారత్-అమెరికా సంబంధాలకు ఎలాంటి విఘాతం కలగబోదని చెప్పాడు. హిందువులకోసం ట్రంప్ ప్రత్యేకంగా ఓ సదస్సు నిర్వహించాడని, ఆయన కుమారుడు, కుమార్తె దేవాలయాలు కూడా సందర్శించారని గుర్తు చేశారు. అయితే, ట్రంప్ భారత్ను సమభాగస్వామిగా భావించాలే తప్ప.. జూనియర్ భాగస్వామిగా భావించవొద్దని అన్నారు.