చైనా సరిహద్దుకు 10 కి.మీ. తగ్గనున్న దూరం
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లోని సేలా పాస్ గుండా రెండు సొరంగ మార్గాలు నిర్మించేందుకు సరిహద్దు రోడ్ల సంస్థ (బీఆర్‌ఓ) ప్రణాళికలు సిద్ధం చేసింది. హిమాలయాల్లో 4,170 మీటర్ల ఎత్తున నిర్మించే ఈ సొరంగాలు పూర్తయితే చైనా సరిహద్దు ప్రాంతమైన తవాంగ్‌కు 10 కి.మీ. దూరం తగ్గుతుంది. అంతేకాకుండా పర్వతాలపై ఎత్తుపల్లాల రోడ్లు, సన్నని మలుపులతోపాటు భారీగా మంచు కురిసే సమయాల్లో తలెత్తే ఇబ్బందులు తప్పుతాయి.
వీటిల్లో ఒక సొరంగం పొడవు 475 మీటర్లు కాగా, మరొక మార్గం పొడవు 1,790 మీటర్లు. ఈ ‘ప్రాజెక్ట్ వర్టాక్’లో భాగంగా బైసాకి నుంచి 12.37 కి.మీ. మేర ఎన్‌హెచ్13ను డబుల్ లేన్ రోడ్డుగా కూడా అభివృద్ధి చేస్తారు.‘ఈ మార్గం వల్ల తేజ్‌పూర్, తవాంగ్‌ల్లోని ఆర్మీ 4 కాప్స్ హెడ్‌క్వార్టర్స్‌కు కనీసం గంట ప్రయాణ సమయం కలిసొస్తుంది. ముఖ్యంగా బోండిలా–తవాంగ్ మధ్యనున్న జాతీయ రహదారి 13కు అనుసంధానంగా ఉంటుంది’అని బీఆర్‌ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సొరంగ మార్గాలు పూర్తయితే అటు సైన్యంతో పాటు ప్రజలు సులువుగా రాకపోకలు సాగించవచ్చని స్వరూప్ తెలిపారు. ఇది భారత ఆర్మీకి వరం వంటిదన్నారు.