
వినికిడిశక్తి లేని డ్రైవర్లకు కొత్త యాప్..!
ఉబెర్ సంస్థ ఇప్పుడు ఓ కొత్త యాప్ ను అభివృద్ధి పరచింది. ముంబైలోని ఓ వినికిడి శక్తి లేని డ్రైవర్ ఇబ్బందులను గమనించిన సంస్థ.. ఈ కొత్త అనువర్తనాన్ని భారత్ లో అందుబాటులోకి తెచ్చింది. పుట్టుకతోనే చెవుడు, ఎంతోమంది వినికిడి శక్తి లేని వారికి అనుకూలంగా ఉండేట్టు ఈ కొత్త యాప్ రూపొందించింది. ఇప్పటికే లాస్ ఏంజిల్స్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్ టన్ డిసి లలో ట్యాక్సీలకోసం సృష్టించిన ఈ 'హైలింగ్ యాప్' ను అభివృద్ధి పరచి భారత్ లో ప్రవేశ పెట్టింది.
ఇతర దేశాల్లో ఇప్పటికే 'ట్యాక్సీ హైలింగ్' యాప్ వాడకంలో ఉన్నప్పటికీ అక్కడ ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అయితే భారత్ లో దీని అభివృద్ధిని ఇప్పుడు ధృవీకరించారు. యాప్ లోని ఈ కొత్త ఫీచర్ ను వాడే డ్రైవర్.. యాప్ ఆన్ చేసి ఉంచుకుంటే సరిపోతుంది. వినియోగదారులనుంచి కాల్ వచ్చినపుడు యాప్ లోఆడియోకి బదులుగా లైట్ ఫ్లాష్ అవుతుంటుంది. ఈ యాప్ లో ప్యాసింజెంర్లు డ్రైవర్ కు ఫోన్ చేసే అవకాశం ఉండదు. వినికిడి శక్తి లేనివారికోసం రూపొందించిన ఈ అనువర్తనంలోని కాల్ ఆప్షన్ కు బదులుగా టెక్స్ట్ ఆప్షన్ ను ప్రవేశ పెట్టారు. దీంతో ప్రయాణీకులు పికప్ ప్రాంతాన్నిటెక్స్ మెసేజ్ ద్వారా తెలిపే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇందులో ఏర్పాటు చేసిన అధిక స్క్రీన్ ద్వారా ప్యాసింజర్లు చేరాల్సిన ప్రాంతాన్ని టెక్స్ట్ మెసేజ్ ద్వారా సూచించాల్సి ఉంటుంది.
ట్యాక్సీ హైలింగ్ యాప్ లోని ఈ కొత్త ఫీచర్.. భారతదేశంలోని వినికిడి శక్తి లేని డ్రైవర్లకు ఉపయోగకరంగా ఉంటుందని, మరింత అవకాశాలను తెచ్చిపెట్టగలదని భావిస్తున్నట్లు ఉబెర్ ప్రొడెక్ట్ ఇన్నోవేషన్ మేనేజర్ బెన్ మెట్కఫె తన బ్లాగ్ లో రాశారు. డ్రైవర్లందరికీ ఒకేరకమైన శిక్షణ ఉంటుందని, అయితే వినికిడి శక్తి తక్కువ ఉన్నవారికి కొంత ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని అంటున్నారు. అందుకోసం ప్రత్యేక శిక్షణాధికారులను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని ఉబెర్ సంస్థ ప్రతినిధి చెప్తున్నారు. వరల్డ్ హెల్గ్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 250 నుంచి 300 మిలియన్ల చెవిటివారు ఉన్నారని, వారిలో 66 శాతంమంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా అందులో ఇండియాలో అధికభాగం ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. అయితే ఇప్పటిదాకా ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు డెఫ్ డ్రైవర్లు చాలా తక్కువమంది ముందుకు వచ్చారని ఉబెర్ ప్రతినిధి చెప్తున్నారు. ముందు ముందు తమ ప్రయత్నం అత్యంత ఉపయోగకరంగా మారుతుందని వారు భావిస్తున్నారు.