ఐపీఎల్‌ రేటింగ్‌.. చీటింగ్‌! | Indian Premier League Betting Based On Fake Rating Arrested | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ రేటింగ్‌.. చీటింగ్‌!

Published Tue, Oct 6 2020 6:52 AM | Last Updated on Tue, Oct 6 2020 8:49 AM

Indian Premier League Betting Based On Fake Rating Arrested - Sakshi

నిందితుడు శశాంక్‌ , ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ రమణారెడ్డికి రివార్డు అందజేస్తున్న సజ్జనార్‌

సాక్షి, హైదరాబాద్‌: దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ట్వంటీ 20 మ్యాచ్‌లు ఆడుతున్న జట్ల బలాబలాలను ఆధారంగా చేసుకొని ఆన్‌లైన్‌ ద్వారానే బెట్టింగ్‌ కాస్తూ అందినకాడికి దండుకుంటున్న ఓ బుకీని, ఏడుగురు పంటర్లను సైబరాబాద్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.22,89,400ల నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు రూ.13 లక్షల నగదు ఉన్న బ్యాంక్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు. ఈ కేసు వివరాలను బాలానగర్‌ డీసీపీ పద్మజారెడ్డి, ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ సందీప్‌లతో కలిసి గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ సజ్జనార్‌ మీడియాకు తెలిపారు.  

జట్ల బలబలాను బట్టి రేటింగ్స్‌... 
కొంపల్లి ఓక్‌ ట్రీ ఎంక్లేవ్‌కు చెందిన చందూర్‌ శశాంక్‌ సుచిత్రా ఎక్స్‌రోడ్డు సమీపంలో ఓంకార్‌ అప్టికల్స్‌ బిజినెస్‌ చేస్తున్నాడు. అయితే అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ఆ షాప్‌నే క్రికెట్‌ బెట్టింగ్‌కి అడ్డాగా మార్చేశాడు. గోవాకు చెందిన ప్రధాన బుకీలు బర్కత్, సాహిల్‌తో సంబంధాలు ఏర్పరుచుకొని హైదరాబాద్‌లో తనకున్న పరిచయాలు ఉపయోగించుకొని శశాంక్‌ క్రికెట్‌ బుకింగ్‌వైపు మళ్లించాడు. వాట్సాప్‌ కాల్‌ చేసి పంటర్లను డబ్బులను గూగుల్‌ పే, ఫోన్‌పేలకు పంపమనేవాడు.  అయితే ఒక్కొక్కరు అంటే బెట్టింగ్‌ కాసేవాళ్లు  రూ.50 వేలు డిపాజిట్‌ చేయమని సూచించేవాడు. ఆ తర్వాత క్రికెట్‌లైన్, క్రికెట్‌ ఎక్స్‌ఛేంజ్‌ మొబైల్‌ యాప్‌లను ఆధారంగా చేసుకొని బుకీ సొహైల్‌ రేటింగ్‌ ఇచ్చేవాడు. బలమైన టీమ్‌లకు రూ.పది వేలకు ఏడు వేలు, బలహీన జట్లు రూ.పది వేలకు రూ.తొమ్మిది వేలు అంటూ బెట్టింగ్‌ వేసేవారు. అయితే చాలా మంది పంటర్లు ఎక్కువ డబ్బులు రావాలనే ఆశతో రూ.పది వేలకు రూ.తొమ్మిది వేల రేటింగ్‌ ఇచ్చినవాటికే మొగ్గుచూపారు. అలాగే ప్రతి బంతికి కూడా ఆయా బ్యాట్స్‌మెన్‌ చేసే పరుగులకు కూడా రేటింగ్‌ ఇస్తూ పంటర్ల నుంచి బెట్టింగ్‌ ఉండేలా చూసుకునేవారు. ఇందులో వచ్చిన డబ్బులను గోవాలో ఉండే ప్రధాన బుకీ బర్కత్‌కు శశాంక్‌ పంపేవాడు.  

నిఘాతో దొరికిపోయాడు.. 
అయితే ఐపీఎల్‌ టోర్నీ ప్రారంభం కావడంతో సైబరాబాద్‌ పోలీసులు క్రికెట్‌ బెట్టింగ్‌లపై ప్రధానంగా నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే బాలానగర్‌ స్పెషల్‌ అపరేషన్‌ టీమ్‌ (ఎస్‌వోటీ) ఇన్‌స్పెక్టర్‌ పి.రమణారెడ్డి నేతృత్వంలోని బృందం పేట్‌బషీరాబాద్‌ పోలీసుల సహకారంతో సుచిత్రా ఎక్స్‌రోడ్డులోని అప్టికల్స్‌లో శశాంక్, ఏడుగురు పంటర్లను పట్టుకున్నారు. రూ.22,89,000ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన బుకీలు బర్కత్, సాహిల్‌తో పాటు మరో ఏడుగురు పంటర్ల కోసం గాలిస్తున్నారు.  

విద్యార్థులూ పారాహుషార్‌ 
‘బుకీలు చూపే అధిక ఆశతో చాలా మంది విద్యార్థులు ఈ క్రికెట్‌ బెట్టింగ్‌వైపు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం ఉంది. వివిధ ఫీజులు కావాలంటూ ఇంట్లో డబ్బులు అడిగే పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. క్రికెట్‌ బెట్టింగ్‌ల వల్ల కుటుంబంలో మనస్పర్ధలు, స్నేహితుల మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి. బెట్టింగ్‌కు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే సైబరాబాద్‌ పోలీసు వాట్సాప్‌ నంబర్‌ 9490617444కు సమాచారం అందించాలి’అని సీపీ సజ్జనార్‌ తెలిపారు. అనంతరం బెట్టింగ్‌ ముఠాను పట్టుకున్న బాలానగర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ రమణారెడ్డితో పాటు ఇతర సిబ్బందిని రివార్డులతో సత్కరించారు.  

ఆ డీఎస్పీ ప్రొఫైల్‌ కేత్వాడ గ్యాంగ్‌ సృష్టే 
సాక్షి,హైదరాబాద్‌: ఏకంగా పోలీసు అధికారుల్నే టార్గెట్‌ చేసి, వారి వివరాలతో ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసిన రాజస్థాన్‌ గ్యాంగ్‌ను నల్లగొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి విచారణ నేపథ్యంలో సిటీకి సంబంధించిన లింకు దొరికింది. అవినీతి నిరోధక శాఖలో (ఏసీబీ) డీఎస్పీగా పని చేస్తున్న వి.రవికుమార్‌ పేరుతోనూ తామే నకిలీ ప్రొఫైల్‌ సృష్టించామని నల్లగొండ అధికారుల విచారణలో ఆ ముఠా అంగీకరించింది. దీనిపై సమాచారం అందుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు న్యాయస్థానంలో పీటీ వారెంట్‌ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వి.రవికుమార్‌ ఏసీబీలో మెదక్‌ రేంజ్‌కి నేతృత్వం వహిస్తున్నారు. ఈయనకు ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ ఉంది. దీనికి సెక్యూరిటీ లాక్‌ లేకపోవడంతో ఇందులోని వివరాలు కాపీ చేసిన సైబర్‌ నేరగాళ్లు ఆయన పేరు, ఫొటోతో నకిలీ ప్రొఫైల్‌ సృష్టించారు. దీని ఆధారంగా ఆయన స్నేహితులతో చాటింగ్‌ చేసి, అత్యవసరం అంటూ నగదు డిమాండ్‌ చేశారు. ఆ మొత్తాన్ని గూగుల్‌ పే ద్వారా 77356 73646కు పంపాలంటూ కోరారు. తన స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న రవికుమార్‌ గత నెల 20న ఈ– మెయిల్‌ ద్వారా సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.  

  • గత నెలలోనే నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పేరుతోనూ ఓ నకిలీ ప్రొఫైల్‌ ఏర్పడింది. దీంతో ఈ విషయాన్ని సవాల్‌గా తీసుకున్న అక్కడి పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేసి రాజస్థాన్‌కు చెందిన ముఠా పనిగా గుర్తించారు.  
  • అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం భరత్‌పురా జిల్లాలోని కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ముస్తభీమ్‌ ఖాన్, ననీష్, షాహిద్, సద్దాం ఖాన్‌లను పట్టుకుని తీసుకువచ్చారు. వీరిలో ప్రధాన నిందితుడైన ముస్తభీమ్‌ ఖాన్‌ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి.  
  • దేశవ్యాప్తంగా మొత్తం 350 మంది పోలీసుల పేర్లతో వీళ్లు నకిలీ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేశారని, వారిలో తెలంగాణకు చెందిన వారు 81 మంది ఉన్నట్లు బయటపడింది.  ఈ వివరాలను ఆరా తీయగా.. రవి కుమార్‌ ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదై ఉన్నట్లు తేలింది.  
  • కేత్వాడ ముఠా అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని నల్లగొండ పోలీసులు సైబర్‌ క్రైమ్‌ అధికారులకు అందించారు. దీని ఆధారంగా న్యాయస్థానంలో పీటీ వారెంట్‌ దాఖలు చేయడానికి సైబర్‌ కాప్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. కోర్టు దీన్ని జారీ చేసిన తర్వాత ఆ నలుగురు నిందితుల్నీ సిటీకి తీసుకురానున్నారు. 
  • ఫేస్‌బుక్‌లో ఈ తరహా నకిలీ ప్రొఫైల్స్‌ సృష్టికి సంబంధించి ఇటీవల కాలంలో సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒకటి మాత్రమే నల్లగొండ పోలీసులకు చిక్కిన కేత్వాడ ముఠా పనిగా తేలింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇలాంటి ముఠాలు మరికొన్ని ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో ఆరా తీస్తూ ఆ కేసుల్ని సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు.   

ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ 
చందానగర్‌: గ్యాస్‌ కట్టర్‌తో  ఏటీఎం మిషన్‌ను కట్‌ చేసి..అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లిన సంఘటన చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. డీఐ నర్సింగ్‌ రావు తెలిపిన వివరాల ప్రకారం... చందానగర్‌ బస్టాప్‌దగ్గర ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు గ్యాస్‌ కట్టర్‌ను వెంట తెచ్చుకొని ఏటీఎంను కట్‌చేసి అందులో ఉన్న రూ.12,86,000 నగదును ఎత్తుకెళ్లారు. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. 

అంతర్రాష్ట్ర గంజాయి ముఠాకు చెక్‌ 
నాగోలు: అంతరాష్ట్ర గంజాయి సరఫరా ముఠాకు ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌లు చెక్‌ పెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా కంటైనర్‌లో తరలిస్తున్న 1010 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం...హర్యానాలోని నుహు జిల్లాకు చెందిన మహ్మద్‌ రంజాన్‌ అలియాస్‌ కల్లూ వృత్తి రీత్యా డ్రైవర్‌.  ఉత్తరప్రదేశ్‌లోని కోరాపుట్‌ జిల్లాకు చెందిన శశికాంత్‌ గౌతమ్‌రావు హోటల్‌లో సర్వర్‌గా పని చేస్తున్నాడు. ఇతను ఒడిశాకు గంజాయి సరాఫరా చేస్తూ ఉంటాడు.  ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వివేక్‌ సింగ్‌ అలియాస్‌ అలోక్‌  వివిధ ప్రాంతాల నుండి వచ్చే గంజాయి కొనుగోలు చేస్తుంటాడు.

హర్యానాకు చెందిన ఇమ్రాన్‌ కంటైనర్‌ ఓనర్‌. వీరందరూ అందరూ కలసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. సులభంగా డబ్బులు  సంపాదించాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా బార్డర్‌ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి కంటైనర్‌ లారీల ద్యారా అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్నారు. కంటైనర్‌లో రహస్య క్యాబిన్‌ ఏర్పాటు చేసి ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి రవాణా చేస్తున్నారు. ఒడిశాలో స్థానికంగా పండించే వారి దగ్గర గంజాయి కొనుగోలు చేసి 5.5 కేజీల ప్యాకెట్లుగా ప్యాక్‌ చేసి కంటైనర్‌లో లోడ్‌ చేశారు. ఈ క్రమంలో ఇమ్రాన్‌ తన కంటైనర్‌ను విజయవాడ మీదుగా వారణాసికి తీసుకెళ్లేందుకు బయలుదేరాడు.

దీనిపై పక్కా సమాచారం అందడంతో ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీస్‌లు అబ్దుల్లాపూర్‌ మెట్‌ పోలీసుల సహకారంతో సోమవారం తెల్లవారు జామున కంటైనర్‌ను పట్టుకున్నారు. డ్రైవర్‌ మహ్మద్‌ రంజాన్,  శశికాంత్‌ గౌతమ్‌రావులను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారికోసం పోలీస్‌లు గాలిస్తున్నారు. సమావేశంలో ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎస్‌ఓటీ డీసీపీ సురేందర్‌రెడ్డి, వి.స్వామి, టి.రవికుమార్, అవినాష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement