
ముంబై : 2019 లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటి నుంచే ఎవరికి వారు తమ ప్రచారాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ముందు ఆలయ నిర్మాణం.. తర్వాతే ప్రభుత్వ ఏర్పాటును తమ ఎజెండాగా ప్రకటించారు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే. అయోధ్య రామ మందిరం నిర్మాణ ప్రచారంలో భాగంగా ఈ నెల 24, 25న అయోధ్యను సందర్శించనున్నారు ఉద్ధవ్ థాకరే. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి హిందూవు డిమాండ్ ఒక్కటే.. ముందు రామ మందిర నిర్మాణం.. ఆ తర్వాతే ప్రభుత్వాలు అంటూ వివరించారు. ఈ నెల 24న అయోధ్యను సందర్శించి.. అక్కడ శౌర్య పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు అన్ని రాష్ట్రాల్లో మహాహరతి పూజా కార్యక్రమాల్ని నిర్వహించాల్సిందిగా కార్యకర్తలను కోరారు. ఈ సందర్భంగా థాకరే మిత్ర పక్షం బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడంలో బీజేపీ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. మందిర నిర్మాణమే తమ ప్రథమ కర్తవ్యంగా ఉద్ధవ్ థాకరే చెప్పుకొచ్చారు.