సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తన వినూత్న ఉజ్వల పథకం విజయ ప్రస్థానం గురించి దేశ పేద మహిళల ముందు ప్రస్థావిస్తూ ‘పిట్ట’ కథకు బదులుగా ప్రముఖ హిందీ రచయిత ప్రేమ్‌చంద్ రాసిన ‘ఈద్గా’ చిన్న కథ గురించి వివరంగా చెప్పారు. అందులో హమీద్ అనే చిన్న కుర్రాడు చేగోడీలో, పకోడీలో కొనుక్కోకుండా దాచుకున్న తన జేబు డబ్బును తన నానమ్మ రొట్టెలు కాలుస్తున్నప్పుడు చేతులు కాల్చుకోకుండా ఉండేందుకుగాను పటకారు కొంటాడు. ‘నానమ్మ చేతులు కాల్చుకోకుండా ఓ చిన్న కుర్రవాడు చేసినప్పుడు ఈ దేశ ప్రధానిగా ఉన్న నేను ఈ మహిళలకు ఎందుకు చేయలేను’ అన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ వినూత్న ఉజ్వల పథకమని మోదీ సగర్వంగా చెప్పుకోవడమే కాకుండా ముచ్చటగా మురిసిపోయారు.
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశాబ్దాల క్రితమే పేదలకు సబ్సిడీ ఎల్‌పీజీ స్కీమ్‌ను అమలు చేశారు. తమిళనాడులో 2007లో అప్పటి డీఎంకే ప్రభుత్వం ఎల్‌పీజీ కనెక్షన్లను, గ్యాస్ స్టవ్‌లను ఉచితంగా అందజేసింది. కేంద్రంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా పేద మహిళలకు సబ్సిడీలపై ఎల్‌పీజీ కనెక్షన్లను అందజేసింది. ఈ స్కీమ్‌లకే మన ప్రధాని నరేంద్ర మోదీ ‘ఉజ్వల’గా పేరు మార్చి అమలు చేశారు. ఉత్తరాదిలో చాలా చోట్ల ఇప్పటికే సిలిండర్లు, గ్యాస్ స్టవ్‌లు అటకెక్కగా, కొన్ని చోట్ల సిలిండర్లు పక్కింటికి, స్టవ్‌లు అంగడికి వెళ్లాయి. ఉచితంగా దొరికే వంట చెరకు బదులుగా నెలకు ఐదారు వందల రూపాయలను గ్యాస్ సిలిండర్‌కు ఎందుకు ఖర్చు చేయాలన్న ఆలోచనే అందుకు కారణం.
నరేంద్ర మోదీ మాత్రం తాను ‘ఈద్గా’ కథ నుంచి స్ఫూర్తి పొంది ఉజ్వల పథకాన్ని అమలు చేసినట్లు చెబుతున్నారు. ఈ కథను చదువుతున్నప్పుడు ఎవరైనా హమీద్‌కు తన నానమ్మ అమీనా పట్ల ఉన్న అంతులేని అభిమానాన్ని అనుభూతి పొందుతాము. నరేంద్ర మోదీ ఉజ్వల లబ్ధిదారులతో మాట్లాడిన సంభాషణ వింటే మనకు ఎలాంటి అనుభూతి కలగదు. పైగా అర్థరహితంగా కనిపిస్తుంది.
ఒడిశాలోని మయూర్‌భంజ్ నుంచి సుశ్మిత... ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడుతూ ‘ఇంతకుముందు వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పడల్లా పొయ్యిలోకి నీళ్లు వచ్చేటివి. పొయ్యి వెలిగేది కాదు. పిల్లలు పస్తులుండేది. ఇక ఆ బాధ ఉండదని అనుకుంటా!’ అని వ్యాఖ్యానించారు. ‘కొత్త స్టవ్ వచ్చిన సందర్భంగా పిల్లలకు నీవు కొత్త వంటకాలు ఏమైనా చేసి పెడుతున్నావా? లేక అదే కట్టెల పొయ్యి మీద చేసినట్లుగా లావు, లావు రొట్టెలు చేసి పెడుతున్నావా?’ అని మోదీ ప్రశ్నించారు. మయూర్‌భంజ్ ప్రాంతంలో ఎక్కువగా అన్నమే తింటారని, రొట్టెలు చేసుకోరన్న విషయం మన ప్రియతమ ప్రధానికి తెలియదు పాపం!
‘నీవు ఏం బాగా చేస్తావు? నీ పిల్లలకు ఏది ఎక్కువ ఇష్టం? వారికి ఏది చేసి పెడతావు?’ అని కూడా సుశ్మితాను మోదీ ప్రశ్నించారు. అందుకు ఆమె ‘మ్యాగీ’ అంటూ సమాధానమిచ్చారు. నిజంగా మ్యాగి చేస్తారా? అంటూ మోదీ ఆశ్చర్యపోతూ మనల్నీ ఆశ్చర్యంలో పడేశారు. మోదీ మరో లబ్ధిదారు మీనాతో మాట్లాడుతూ ‘ మీ ఇరుగుపొరుగున ధనవంతులున్నారు. వారికి అందమైన ఇళ్లు ఉన్నాయి. కార్లు ఉన్నాయి. స్కూటర్లూ ఉన్నాయి. అన్నింటికన్నా ముందు గ్యాస్ స్టవ్‌లు ఉన్నాయి. మీకు ఇంతకాలం గ్యాస్ స్టవ్ లేదు.....మాకే గ్యాస్ స్టవ్ ఉందంటూ ఇంతకాలం రొమ్ము విరుచుకుని తిరిగాంగానీ ఇప్పుడు ఈ మోదీ వచ్చి ఓ పేదకు గ్యాస్ స్టవ్ ఇచ్చారు. ఇక మమ్మల్ని చూసి ఔరా! అనే వారే ఉండరని వారంటారుగదా!’ అన్న వ్యాఖ్యల్లో ఎవరికి తోచిన అర్థాలు వారు వెతుక్కోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment