కెరమెరిలో నిరుపేదలకు గ్యాస్ కనెక్షన్ అందజేస్తున్న అధికారులు
ఆసిఫాబాద్‌అర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా వంటింట్లో పొగ తిప్పలు తప్పేలా కనిపిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా నిరుపేద మహిళలను అర్హులుగా చేర్చుతూ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు ఈ పథకంతో మేలు జరగనుంది. ఈ నేపథ్యంలో అర్హులను గుర్తించి సిలిండర్లు అందజేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 11,142 మందికి ఈ పథకం కింద కనెక్షన్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు.
ఉచితంగా సిలిండర్లు..
దారిద్య్ర రేఖకు దిగవనున్న కుటుంబాల్లో నేటికీ వంట చేసుకోవడానికి కట్టెలే దిక్కు. ఇలాంటి వారిని పొగ నుంచి విముక్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం ప్రవేశపెట్టింది. నేటికీ చాలా వరకు గ్రామాల్లో కట్టెల పొయ్యి దిక్కు. వంట చేసేటప్పుడు మహిళల కళ్లల్లోకి పొగ వెళ్లడంతో అనారోగ్యం పాలవుతున్నారు. ఆహారం సైతం కలుషితమవుతుంది. 2016లో ఉత్తరప్రదేశ్‌లోని బాల్లియాలో మొదటగా ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేశారు. దశల వారీగా దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. రూ.1600లు విలువ చేసే గ్యాస్ కనెక్షన్ పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు. గ్యాస్ పొయ్యితో పాటు రెగ్యులేటర్, మిగితా అన్ని వస్తువులను అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాయి.
పథకానికి అర్హులు వీరే..
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఈ పథకానికి అర్హులు. అంత్యోదయ కార్డు కలిగిన వారికి కూడా ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఇది వరకు గ్యాస్ కనెక్షన్ లేనివారికి సైతం ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రేషన్‌కార్డు కలిగి ఉన్న పేదలను ఈ పథకానికి అర్హులుగా ఎంపిక చేస్తున్నారు. ఉజ్వల యోజన పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ పొందాలంటే మహిళకు బ్యాంకు ఖాతా పుస్తకం ఉండాలి. రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు అవసరం. రేషన్ కార్డు ఉండాలి. మొబైల్ నంబరుతో సమీప గ్యాస్ ఏజెన్సీలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదట దరఖాస్తు గడువు ఆగస్టుతో ముగిసింది. తిరిగి మళ్లీ ఈనెల 18 నుంచి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
గ్రామీణ ప్రాంతాల వారికి ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా జిల్లాలో 11,142 మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశాం. అర్హులు ధ్రువపత్రాలను సంబంధత అధికారులకు అందించి నేరుగా కనెక్షన్లు పొందవచ్చు. ఈ పథకం దరఖాస్తు గడువు ఆగస్టు నెలలోనే ముగిసింది. తిరిగి మళ్లీ నేటి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. – టి.సత్యనారాయణ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి