‘కావేరి’పై ఢిల్లీలో రేపు కీలక భేటీ
న్యూఢిల్లీ: కావేరి నది జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు గురువారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో సమావేశం కానున్నారు. రేపు 11.30 గంటలకు సమావేశానికి హాజరు కావాలని తమిళనాడు సీఎం జయలలిత, తనకు ఉమాభారతి వర్తమానం పంపారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ భేటీ నేపథ్యంలో తమిళనాడుకు కావేరి నది జలాల విడుదలను వాయిదా వేసినట్టు చెప్పారు. కేంద్ర మంత్రిలో సమావేశం తర్వాత నీటి విడుదల విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 క్యూసెక్కుల కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సలహా ఇచ్చింది.
ఈ నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు సీఎంలతో ఉమాభారతి సమావేశమవుతున్నారు. అయితే అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఈ భేటీకి హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. తన తరపున ఆమె ప్రతినిధుల బృందాన్ని పంపనున్నారని సమాచారం.